Male Reproductive: సంతాన సామర్థ్యంపై కరోనా ఎఫెక్ట్.. మగవాళ్లలో టెన్షన్!

కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బకు ప్రపంచం అల్లాడిపోతోంది.

  • Written By:
  • Updated On - April 12, 2022 / 12:04 PM IST

కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బకు ప్రపంచం అల్లాడిపోతోంది. ఊపిరితిత్తులను దెబ్బతీసి.. వివిధ రకాల జబ్బులకు కారణమవుతోంది. దీని దారుణాలు అక్కడికో ఆగలేదు. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థనూ తీవ్రంగా దెబ్బతీస్తోందని తాజా పరిశోధనలో తేలింది. దీంతో ఈ అంశం మగవారిలో ఆందోళన పెంచుతోంది. కరోనా సోకినవారికి ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్నదానితో సంబంధం లేకుండా ఇది ఎఫెక్ట్ చూపిస్తోందని మన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కరోనా సోకినవారిలో చాలామందికి ఇన్ఫెక్షన్ తక్కువ స్థాయిలో ఉంటోంది. కొంతమందికి అయితే అసలు లక్షణాలే కనపడలేదు.

అయినా సరే అలాంటివారిలో కూడా పునరుత్పత్తి సామర్థ్యం… అంటే పిల్లలను కనే శక్తిపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు ఐఐటీ-బాంబే, ముంబయి లోని జస్ లోక్ ఆసుపత్రి-పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పురుషుల పునరుత్పత్తి అవయవాల్లో కరోనా ఉనికి ఉంటోందని తెలియగానే మగవారిలో ఆందోళన పెరిగింది. దీంతో పరిశోధకులు ఈ విషయంపై లోతైన పరిశోధన చేశారు. పురుషుల సంతాన సామర్థ్యంపై కరోనా ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది తెలుసుకోవడమే వారి ప్రధాన టార్గెట్. ఈ పరిశోధన కోసం వారు రెండు వర్గాల వారిని ఎంచుకున్నారు. కరోనా సోకి కోలుకున్న 17 మంది మగవారిని తీసుకున్నారు.

అలాగే ఈ ఇన్ఫెక్షన్ సోకని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఇంకో 10 మంది పురుషులను తీసుకున్నారు. వీరంతా 20-45 ఏళ్లలోపువారే. వీరి వీర్యంలోని ప్రొటీన్ల స్థాయిలను పరిశీలించారు. కరోనా బాధితుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోయిందని వీరి పరిశోధనలో తేలింది. పైగా వాటి కదలిక కూడా తగ్గింది. ఆకారం కూడా మారిపోయింది. సంతానోత్పత్తికి సహకరించే వీర్యంలోని 27 ప్రొటీన్ల స్థాయిలు పెరిగాయి. మరో 21 ప్రొటీన్ల స్థాయిలు తగ్గాయి. సెమెనోజెలిన్-1, ప్రొసొపోసిన్ ప్రొటీన్ల స్థాయి అయితే వాటి సామర్థ్యంలో సగాన్ని కోల్పోయాయి. కాకపోతే దీనిపై ఇంకా విస్తృతస్థాయి పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు భావించారు.