PM Modi Birth Day Special : మ్యాజికల్ మ్యాన్ మోడీ.. ఛాయ్ వాలా టు ప్రైమ్ మినిస్టర్

PM Modi Birth Day Special : నరేంద్ర మోడీ .. ఒక మ్యాజికల్ మ్యాన్. ఛాయ్ వాలా నుంచి ప్రధానమంత్రి దాకా ఆయన సాగించిన ప్రస్థానం అనన్య సామాన్యం.

  • Written By:
  • Updated On - September 17, 2023 / 07:18 AM IST

PM Modi Birth Day Special : నరేంద్ర మోడీ .. ఒక మ్యాజికల్ మ్యాన్. ఛాయ్ వాలా నుంచి ప్రధానమంత్రి దాకా ఆయన సాగించిన ప్రస్థానం అనన్య సామాన్యం. ఇవాళ ఆయన 73వ పుట్టినరోజు. ఈసందర్భంగా మోడీ కెరీర్ గ్రాఫ్ లోని కీలక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఛాయ్ వాలా ఎలా అయ్యారంటే.. 

మన ప్రధానమంత్రి పూర్తి పేరు.. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అలియాస్ నరేంద్ర మోడీ.  ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా వాద్‌నగర్‌లో ఓ బీసీ వర్గానికి చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోడీ జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు  హీరాబా మోడీ, దామోద‌ర్ దాస్ మోడీ. ఈ దంపతులకు మొత్తం ఆరుగురు సంతానం. అయితే వారిలో మూడో వ్యక్తి న‌రేంద్ర మోడీ. పేదరికం కారణంగా వారి ఫ్యామిలీ చిన్న ఇంట్లో ఉండేది. మోడీ తండ్రికి వాద్ నగర్ లోని రైల్వే స్టేష‌న్‌లో ఒక టీ స్టాల్‌ ఉండేది. చిన్నప్పుడు నరేంద్ర మోడీ చదువుకుంటూనే.. త‌న తండ్రి టీ స్టాల్‌ కు వెళ్లి ఆయనకు పనుల్లో హెల్ప్ చేస్తుండేవారు. 1967 వ‌ర‌కు వాద్‌న‌గ‌ర్‌లోనే హ‌య్య‌ర్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ ను మోడీ పూర్తి చేశారు. ఆ త‌రువాత నరేంద్రమోడీ కూడా అదే రైల్వే స్టేషన్ లో సొంతంగా ఒక టీ స్టాల్ ఏర్పాటు చేసుకొని నడిపారని, అందువల్లే ఆయనకు ఛాయ్ వాలా అనే పేరు వచ్చింది.

Also read : All About YashoBhoomi : ప్రధాని మోడీ బర్త్ డే గిఫ్ట్ ‘యశోభూమి’.. ఇంట్రెస్టింగ్ వివరాలివీ

8 ఏళ్ల ఏజ్ లోనే ఆర్ఎస్ఎస్ లోకి.. ఆ తర్వాత బీజేపీలోకి..

ప్రధాని మోడీ 8 సంవత్సరాల ఏజ్ లోనే రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు ఆక‌ర్షితులయ్యారు. చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ బాలసేవక్ గా అందులో చేరారు. ఇక  1971లో ఆర్ఎస్ఎస్‌లో పూర్తిగా చేరారు. 1975లో అప్ప‌టి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన‌ టైంలో మోడీ కొన్నాళ్లు అండ‌ర్ గ్రౌండ్‌లో తలదాచుకున్నారు. అనంతరం 1978లో యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుంచి పొలిటిక‌ల్ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ చేశారు. ఆ త‌రువాత 1983లో గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ నుంచి డిస్ట‌న్స్‌లో పొలిటిక‌ల్ సైన్స్‌లో మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కోర్సు చేశారు. 1985లో ఆర్ఎస్ఎస్ ఆయ‌నను బీజేపీలో చేర్పించింది. 1987లో జరిగిన అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యంలో మోడీ కీలక పాత్ర పోషించారు. దీన్ని గుర్తించిన పార్టీ ఆయనను గుజ‌రాత్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్ర‌ట‌రీగా చేసింది. కట్ చేస్తే.. 1990లో బీజేపీ నేష‌న‌ల్ ఎలెక్ష‌న్ క‌మిటీలో మోడీ స‌భ్యుడ‌య్యారు. అదే ఏడాది బీజేపీ దిగ్గజం ఎల్‌కే అద్వానీ చేప‌ట్టిన రామ్ ర‌థ్ యాత్ర‌కు, 1991-92లో ముర‌ళీ మనోహ‌ర్ జోషి చేప‌ట్టిన ఏక్తా యాత్ర‌కు నరేంద్ర మోడీ కో ఆర్డినేటర్ గా ప‌నిచేశారు.

మోడీకి గుజరాత్ సీఎం పోస్టు ఇలా దక్కింది..

1995 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీనిలో మోడీ కీలక పాత్ర పోషించారు. దీంతో పార్టీ ఆయనకు జాతీయ కార్య‌ద‌ర్శి ప‌దవి ఇచ్చి ఢిల్లీకి పిలిపించింది. 1998లో గుజ‌రాత్‌లోని బీజేపీ సర్కారు అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీని మోడీ దగ్గరుండి గెలిపించారు.  దీంతో మోడీకి పార్టీలో ఇంకో ప్రమోషన్ వచ్చింది. ఈసారి ఆయనకు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పదవి లభించింది. ఇక 2001లో అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ ప‌టేల్ అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో సంభవించిన భుజ్‌ భూకంప బాధితులను ఆదుకోవడంలోనూ కేశూభాయ్ విఫలం అయ్యారు. దీంతో కేశూభాయ్ ను తప్పించిన బీజేపీ అధిష్టానం.. నరేంద్ర మోడీని గుజ‌రాత్ సీఎంగా చేసింది.  2001 అక్టోబ‌ర్ 7 నుంచి 2014 మే 22 వ‌ర‌కు 12 ఏళ్ల 7 నెల‌ల పాటు సుదీర్ఘంగా గుజరాత్ సీఎంగా మోడీ సేవలందించారు.  2014లో తన వ్యూహాలతో దేశంలో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు ప్రధానమంత్రి పదవి (PM Modi Birth Day Special) దక్కింది.