Caste Issues: పొంచి ఉన్న కుల వివక్ష ముప్పు

కుల వివక్ష భారతీయ సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. కుల వ్యత్యాసాలు, అంటరానితనం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి.

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 08:10 AM IST

కుల వివక్ష భారతీయ సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. కుల వ్యత్యాసాలు, అంటరానితనం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఒకరిపై ఒకరికి ద్వేషం పెరిగిపోతుంది. చివరకు మత మార్పిడులకు దారి తీస్తోంది. ఆ రకమైన ధోరణి భారత సమాజానికి ప్రమాదకరం. సమాజంలో అంతరాలు పెరిగిపోయి భిన్నత్వంలో ఏకత్వం గల మన సంస్క‌‌ృతి అంతరించిపోయే అవకాశం ఉంది. అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవించే ఓ ఉద్యమాన్ని చేపట్టివలసిన బాధ్యత పెద్దలపై ఉంది. ఈ ఆధునిక సమాజంలో కూడా అగ్రవర్ణాలు, దళితులు అనే వ్యత్యాసం ప్రపంచంలో మన స్థాయిని దిగజారుస్తుంది. మన దేశంలో ఇటీవల జరిగే ధోరణులను చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. కుల వివక్ష, అంటరానితనం, దళితులను హీనంగా చూడటం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక మొదలైన రాష్ట్రాల్లో ఈ ఒక్క నెలలోనే ఇటువంటి పలు సంఘటనలు జరిగాయి. ఈ వివక్షకు తట్టుకోలేక ఆ దళితులందరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేపట్టిన బౌద్ధమతంలో చేరుతున్నారు. అంతే కాకుండా, వారు అప్పటి వరకు పూజించిన హిందు దేవత విగ్రహాలను, ఫొటోలను నదుల్లో పారవేస్తున్నారు. కొందరైతే హిందూ దేవతలను కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మనుషుల మనసులు కలుషితమై భవిష్యత్ లో మత కలహాలకు,వర్గ కలహాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

రాజస్థాన్‌లోని బారన్‌ జిల్లా భులోన్‌ గ్రామంలో ఈ నెల 5న దళిత యువకులు దుర్గాదేవికి పూజలు చేసి హారతి ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన అగ్ర కులస్థులు కొందరు వారిపై దాడి చేసి కొట్టారు. దళితులు ఉన్నతాధికారులు, పోలీసుల దగ్గర నుంచి రాష్ట్రపతి కార్యాలయం వరకు ఫిర్యాదులు చేశారు. 15 రోజులు గడిచిపోయినా ఫలితం లేకపోవడంతో గ్రామంలోని దళిత కుటుంబాలు ఈ నెల 21న సమావేశమై హిందూ మతాన్ని వదిలి బౌద్ధం స్వీకరించాలన్న నిర్ణయానికి వచ్చారు. అందరూ కలిసి గ్రామంలో ఆక్రోష్‌ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఇళ్లలో అప్పటి వరకు పూజలు చేసిన హిందూ దేవతల బొమ్మలు, చిత్ర పటాలను తీసుకెళ్లి సమీపంలోని బేతిల్‌ నదిలో కలిపారు. దళితులపై దాడులు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మతం మార్చుకున్నట్లు వారు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కరేరా గ్రామంలో ఈ నెల 20న వాల్మీకి సమాజానికి చెందిన 236 మంది సభ్యులు కుల వివక్ష నుండి తప్పించుకోవడం కోసం బౌద్ధ మతాన్ని స్వీకరించారు. వారంతా 22 ప్రతిజ్ఞలను చదివి బౌద్ధ మతంలోకి మారారు.
ఈ గ్రామంలో కుల వివక్ష చాలా సంవత్సరాలుగా కొనసాగుతోందని, కుల వివక్ష నుంచి బయటపడడానికి, శాంతియుత మార్గంలో జీవనం గడపడానికి, ఆత్మన్యూనతా భావం నుండి బయటపడడానికి వాల్మీకులు బౌద్ధమతం స్వీకరించినట్లుగా బీఆర్ అంబేద్కర్ వారసులైన రాజారత్న అంబేద్కర్ తెలిపారు.

ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్‌తోపాటు దాదాపు వెయ్యి మంది సామూహికంగా బౌద్ధమతం స్వీకరించారు. వారంతా హిందూ దేవుళ్లను దూషించడంతోపాటు 22 ప్రమాణాలు చేశారు.‘‘నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులపై విశ్వాసం లేదు, వారిని పూజించను’’ అని వారంతా ప్రమాణం చేశారు. కర్ణాటకలోని యాద్‌గిరి జిల్లాలోని సురపుర పట్టణానికి సమీపంలోని హుణసాగిలో ఈ నెల 14న పలువురు బౌద్ధ మతం(బుద్ధ ధర్మ దీక్ష)లోకి మారారు.వారంతా హిందూ దేవుళ్ల ఫొటోలు, విగ్రహాలను కృష్ణా నదిలో పడేశారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి. ఇటువంటి ధోరణి భారతీయ సమాజానికి కీడు చేస్తుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.