Site icon HashtagU Telugu

Crow: నైతిక విలువలు కలిగిన కాకిలా కలకాలం జీవిద్దాం!

Crow

Crow

Crow: తీవ్ర రేడియేషన్.. టెక్నాలజీ కారణం మనకు నిత్యం కనిపించే కాకులుసైతం అంతరించిపోతున్నాయి. అయితే కాకుల వల్ల ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక్కసారి వాటి జీవితంలోకి తొంగి చూస్తే చాలు విలవైన పాఠాలు బోధిస్తాయి. ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న ‘అన్ని కాకులకు’ సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి ‘సంఘటితంగా పోరాటం’ చేపట్టేవి కాకులు. ఆడ కాకి – మగ కాకి కలవడం కూడా ‘పరుల కంట’ పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.

ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే ‘కాకులు దూరని కారడవి’ అంటారు.

కాకులు అరుస్తోంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు. అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకి కాలజ్ఞాని అంటారు. దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు. మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.