ITBP: మావోల కంచుకోటలో.. ITBP విద్యా విప్లవం!!

ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP)..ఇది కేవలం హిమాలయ సరిహద్దు రాష్టాల్లోనే ఉంటుందని అనుకుంటారు.

  • Written By:
  • Publish Date - May 16, 2022 / 06:00 AM IST

ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP)..ఇది కేవలం హిమాలయ సరిహద్దు రాష్టాల్లోనే ఉంటుందని అనుకుంటారు. కానీ ఇది 2009 సంవత్సరం నుంచే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఛత్తీస్ గఢ్ లోని రెడ్ కారిడార్ లో భద్రతా సేవలు అందిస్తోంది. ఇందుకు అదనంగా మావోయిస్టు ప్రభావిత గ్రామాల పిల్లలకు చదువులపై ఆసక్తిని పెంచే మోటివేషన్ కూడా చేస్తోంది. కొందరు ITBP సిబ్బంది జట్టుగా ఏర్పడి చూపుతున్న చొరవ వల్ల ఇది సాధ్యమవుతోంది. ఆయా ఆదివాసీ, గిరిజన గ్రామాల బాలలకు రోజూ స్కూల్ ముగియగానే.. “లవకుశ”, “నవోదయ” పాఠశాలల ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలో 5, 6 తరగతులకు చెందిన దాదాపు 215 మంది విద్యార్థులకు ఈ కోచింగ్ అందుతోంది. ప్రధానంగా గణితం, సైన్స్, ఇంగ్లీష్, కరెంట్ ఎఫైర్ పై ప్రధాన దృష్టితో పిల్లలకు కోచింగ్ ఇస్తున్నారు. ఒకసారి “లవకుశ”, “నవోదయ” పాఠశాలల్లో విద్యార్థికి సీటు లభిస్తే.. ఇంటర్ రెండో ఏడాది వరకు విద్యాభ్యాసం ఉచితంగా అందుతుంది. బస్తర్ జిల్లా కొండగావ్ ఏరియాలో మోహరించిన ITBP 29వ బెటాలియన్ కు చెందిన సిబ్బంది ఈ తరహా కార్యక్రమాలతో విధులపై అంకితభావాన్ని చాటు కుంటున్నారు.

ముంజే మెటా, ఫర్సా గావ్, ఝరా, ధౌడై గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ తో వీరు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే లవకుశ, నవోదయ గురుకుల పాఠశాలల ఎంట్రెన్స్ లలో ఇక్కడి విద్యార్థులు సత్తా చాటుతారని ITBP సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ITBP 41వ బెటాలియన్ సభ్యులు మరో అడుగు ముందుకు వేశారు. వారు హాదేలి ఏరియా చుట్టుపక్క గ్రామాల విద్యార్థుల కోసం ఏకంగా స్మార్ట్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. వీటిని 1 నుంచి 9 తరగతులకు చెందిన దాదాపు 50 మంది విద్యార్థులు రోజూ వింటున్నారు. 7 నుంచి 9 తరగతుల విద్యార్థుల కు ఉదయం వేళ గంటన్నర.. మిగితా క్లాస్ ల వారికి సాయంత్రం గంటన్నర స్మార్ట్ క్లాస్ లు జరుగుతున్నాయి. దీంతోపాటు 2009 నుంచి ఇప్పటివరకు ITBP సిబ్బంది వందలాది మంది విద్యార్థులకు జూడో, అథ్లెటిక్స్, విలు విద్య, హాకీ వంటి క్రీడల్లోనూ శిక్షణ అందించారు. గత 13 ఏళ్లలో రెడ్ కారిడార్ పరిధిలోని దాదాపు 1200 మంది గిరిజన, ఆదివాసీ యువతకు వివిధ ఐటీఐ డిప్లొమా కోర్సుల్లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వీరిలో దాదాపు 500 మందికి ఇప్పటికే జాబ్స్ వచ్చాయి.