Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా గులాంనబీ వైపు బీజేపీ మొగ్గు!

ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ.. రాష్ట్రపతి ఎన్నికపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా గులాంనబీ ఆజాద్ ను నిలబెట్టాలని ప్రధాని మోదీ అనుకుంటున్నట్టు సమాచారం.

  • Written By:
  • Updated On - March 4, 2022 / 11:06 AM IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ.. రాష్ట్రపతి ఎన్నికపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా గులాంనబీ ఆజాద్ ను నిలబెట్టాలని ప్రధాని మోదీ అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ఆజాద్ కూడా పార్టీల నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ముస్లిం నేతను అభ్యర్థిగా నిలబెడితే.. ఆ వర్గంలో బీజేపీపై గూడుకట్టుకున్న వ్యతిరేకత తొలగడానికి అవకాశం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు.

రాజ్యాంగపరంగా చూస్తే రాష్ట్రపతి పదవే అత్యున్నతమైనది. పైగా ఆజాద్ అన్ని పార్టీలవారికి సన్నిహితంగా ఉంటారు. అపారమైన రాజకీయ అనుభవం ఉంది. అందుకే ఆయనను నిలబెడితే.. ఏకాభిప్రాయంతో ఎన్నికను పూర్తి చేయవచ్చని బీజేపీ ఆలోచిస్తోంది. ఇతర పార్టీల మద్దతు లేకుండా తమ అభ్యర్థిని గెలిపించుకోవడం బీజేపీకీ సాధ్యం కాదు. ఆజాద్ అయితే ఈ విషయంలో సమస్య ఉండదని యోచిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది కీలక నేతలకు నాయకుడిగా ఆజాదే ఉన్నారు. తరువాత పరిణామాలు చకచకా మారిపోయాయి. రాజసభ నేతగా ఆజాద్ పదవీకాలం పూర్తయ్యాక తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మోదీ.. సభలోనే కంటతడి పెట్టారు. అప్పుడే వారి మధ్య రాజకీయబంధం ఎంత బలంగా ఉందో అన్ని పార్టీలకు అర్థమైంది.

గులాంనబీ ఆజాద్ కు ఈ ఏడాది పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. అంటే బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నిక కావాలంటే.. ఎలక్టోరల్ కాలేజీలో సగం ఓట్లు కావాలి. అలా చూస్తే.. 5,49,452 ఓట్లు కావాలి. కానీ బీజేపీకి 4,74,102 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా గెలిచిన రామ్ నాథ్ కోవింద్ కు 7,02,044 ఓట్లు వచ్చాయి. కాకపోతే ఆనాటి ఎన్నికలో చాలావరకు ప్రాంతీయ పార్టీలు ఆయనకు మద్దతిచ్చాయి.

యూపీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైతే.. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో దాని మాట నెగ్గడం కష్టమవుతుంది. మిగిలిన పార్టీలు కూడా మద్దతివ్వడానికి ముందుకు రాకపోవచ్చు. అందుకే తెలివిగా ఆజాద్ ను రంగంలోకి దించింది. ఏదేమైనా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితం తరువాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్సుంది.