Indira Gandhi : ఇవాళ దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి. ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భాగంగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌పై సైనిక చర్యకు ప్రతీకారంగా.. 1984 అక్టోబర్ 31న మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఇద్దరు సిక్కు బాడీగార్డ్స్ ఆమెను హత్య చేశారు. దేశంలోని బ్యాంకులను ప్రభుత్వపరం చేసిన డైనమిక్ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీకి పేరుంది. 1971 సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ యుద్ధం వేళ పీఎంగా ఆమె ఉన్నారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ నాయకత్వంలోనే మనదేశం 1974లో తొలి అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో ప్రపంచంలో అణుశక్తి కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఇందిరాగాంధీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
- 1916 ఫిబ్రవరి 8న జవహర్ లాల్ నెహ్రూ(26), కమల(17)ల వివాహం జరిగింది.
- 1917 నవంబర్ 19న నెహ్రూ, కమల దంపతుల ఇంట ఇందిర (Indira Gandhi) పుట్టారు.
- అలహాబాద్‌లోని ఆనంద్ భవన్‌లో ఇందిర బాల్యం గడిచింది. 1924 నవంబర్‌లో ఇందిరకు తమ్ముడు పుట్టాడు కానీ రెండు రోజులకే చనిపోయాడు.
- 1931లో మోతీలాల్ నెహ్రూ మరణించారు. ఇందిరను పుణెలోని బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు.
- 1942 మార్చి 26న ఇందిరకు ఫిరోజ్ గాంధీతో వివాహం అయింది. అదే ఏడాది ఇందిర తన పొడవాటి జడను తొలిసారి కట్ చేసుకున్నారు.
- 1944లో ఇందిర, ఫిరోజ్‌లకు మొదటి సంతానం రాజీవ్ జన్మించారు. 1946 నవంబర్‌లో ఇందిర కుటుంబం లక్నోకు వెళ్లింది. 1946లో రెండో కుమారుడు సంజయ్ పుట్టారు.
- 1959లో ఇందిర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. 1964 నుంచి 1966 వరకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రిగా చేశారు.
- 1966లో కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రధానమంత్రి పదవిని చేపట్టాలనే అంశంపై ఓటింగ్ జరిగింది. ఇందిరకు 355 ఓట్లు రాగా, దేశాయ్‌కి 169 ఓట్లు వచ్చాయి. ఇందిర తనను తాను దేశ సేవకురాలిగా ప్రకటించుకున్నారు.
- 1968లో దేశంలో హరిత విప్లవం మొదలైంది. వ్యవసాయానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
- 1971 ఎన్నికల్లో ఇందిరగాంధీ గరీబీ హఠావో నినాదాన్నిచ్చారు. ఇది చర్చనీయాంశంగా మారింది. తర్వాత కాలంలో ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు.
- 1974లో అధికోత్పత్తినిచ్చే విత్తనాలు, మెరుగైన సాగునీటి వసతుల కల్పించడం ద్వారా ఆమె వ్యవసాయ రంగ స్థితిగతుల్ని మార్చి ఆహారధాన్యాల్లో మిగులును సృష్టించారు.
- 1974 లో ఇందిర సారథ్యంలోని ప్రభుత్వం అణు పరీక్షలు జరిపి దేశాన్ని ప్రపంచ అణు శక్తి గల దేశాల సరసన నిలిపారు.
- 1975లో ఇందిర గాంధీ దేశంలో అత్యవసర స్థితిని విధించారు. ఆమె పాలన వివాదాస్పదమైంది.
- 1977 ఎన్నికల్లో ఇందిర ఓడిపోయారు. మొరార్జీ దేశాయి తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
- 1980లో ఇందిరా గాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చారు.
- 1984 అక్టోబర్ 31న ఇందిర ఆంతరంగిక భద్రతా సిబ్బందిలోని ఇద్దరు సిక్కు సైనికులు ఇందిరను కాల్చిచంపారు.