Site icon HashtagU Telugu

Accident Policy: రోజుకు కేవలం ఒక్క రూపాయితో ₹10 లక్షల ప్రమాద బీమా

India Post Accident Policy

India Post Accident Policy

ఇటీవలి కాలంలో, ప్రమాద బీమా పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా తరహాలో ప్రమాద బీమా (Accident Policy) కూడా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇతర సంస్థల తరహాలోనే, తపాలా శాఖ (Postal Department) కూడా ఒక ప్రమాద బీమా పథకాన్ని ఇటీవల అందుబాటులోకి తీసుకు వచ్చింది. టాటా ఏఐజీతో (Tata AIG General Insurance Company) కలిసి దీనిని ప్రారంభించింది. గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ పేరిట, పోస్టాఫీసు ఖాతాదార్ల కోసం ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ తీసుకున్న వాళ్లు ఏడాదికి కేవలం 399 రూపాయలు చెల్లిస్తే చాలు, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా (Accident Policy) సౌకర్యం పొందవచ్చు. అంటే, రోజుకు ఒక్క రూపాయి కంటే కాస్త ఎక్కువ ఖర్చుతో, ఒక భారీ ప్రమాద బీమా కవరేజీని పొందవచ్చు. తద్వారా, మీ మీద ఆధారపడిన వాళ్లకు ఆర్థిక భరోసా ఇవ్వవచ్చు.

ఎవరు అర్హులు?

18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ‍‌‍(India Post Payments Bank) ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే, ఈ బీమా తీసుకోవాలంటే ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ఖాతా ఉండడం తప్పనిసరి. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, ఏదైనా అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే, ఐపీడీ (ఇన్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌) కింద 60 వేల రూపాయలు లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. ఔట్‌ పేషెంట్‌ విషయంలో.. 30 వేల రూపాయలు లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తంలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు.

ఇతర అదనపు ప్రయోజనాలు

ఈ పాలసీలో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా ఇద్దరు పిల్లలకు, ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు. కుటుంబ ప్రయోజనం కింద 25 వేల రూపాయలు, అంత్యక్రియల కోసం మరో 5 వేల రూపాయలు అందుతాయి. ఆసుపత్రిలో చికిత్స సమయంలో, రోజువారీ నగదు రూపంలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు ఇస్తారు.

రూ. 299కి కూడా..

ఇదే పథకాన్ని 299 రూపాయల ఆప్షన్‌తోనూ తపాలా శాఖ అందిస్తోంది. దీనిని ఎంపిక చేసుకుంటే, ఏడాదికి 299 రూపాయలు చెల్లించినా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణం, వైకల్యం, పక్షవాతం, వైద్య ఖర్చులు వంటివి ఈ ఆప్షన్‌లో కవర్‌ అవుతాయి. పైన చెప్పుకున్న అదనపు ప్రయోజనాలు మాత్రం అందవు.

Also Read:  Zombies: కిమ్ సైన్యంలో ‘జాంబీలు’.. వైరల్ అవుతున్న ఫొటోలు!