Site icon HashtagU Telugu

Truths of India Independence : భారత స్వాతంత్య్రం.. మనం తెలుసుకోవాల్సిన నిజాలు!

Independent Day 2023

Truths Of India Independence

Truths of India Independence : 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని వేడుకగా సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది..

76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని (India) సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను ఫణంగా పెట్టి సుదీర్ఘ పోరాటం సాగించారు. ఆ ఫలితమే మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. అందుకే పంద్రాగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయ రోజుగా నిలిచిపోయింది.

భారత స్వాతంత్య్రోద్యమం గురించి చాలా మంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకొని ఉంటారు. అలాగే స్వాతంత్య్రోద్యమంపై చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి. పుస్తకాలు, సినిమాలు, నాటకాల్లో ప్రస్తావించని ఎన్నో విషయాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

  1. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి నుంచే మనం 76వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజు భారత్‌ తో పాటు కొరియా, కాంగో, బెహ్రయిన్, లీచెన్‌స్టీన్ దేశాలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
  2. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని ఆఖరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ మన పెద్దలకు సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తేదీనీ ఆయన సూచించారు. సింగపూర్‌లో జపాన్ లొంగుబాటును అంగీకరించిన సౌత్ – ఈస్ట్ ఆసియా కమాండ్‌కు మౌంట్ బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్‌గా వ్యవహరించారు.
  3. జాతీయ గీతం ‘జన గణ మణ’ ను రబీంద్రనాథ్ ఠాగూర్ రచించారని అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ జార్జ్ వి గౌరవార్థం ఠాగూర్ రంచించారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు.
  4. జాతీయ గేయం ‘వందేమాతరం’ ను బంకించంద్ర ఛటర్జీ రచించారు. వాస్తవానికి ఇదొక పద్య భాగం. ఇది ఛటర్జీ రచించిన ‘ఆనంద్ మఠ్’ నవలలోని మొదటి రెండు చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ప్రకటించారు.
  5. భారత స్వాతంత్య్రోద్యమం 1857లోనే ప్రారంభమైంది. మంగల్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తరవాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్య తోపె, బహదూర్ షా జఫర్, నానా సాహెబ్ పోరాటాలు చేశారు.
  6. భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. రాష్ట్రంలో ముస్లింలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పాకిస్థాన్‌లోనే కలుస్తుందని ఆ దేశం నమ్మింది. కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. 1947 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్.. భారత్‌లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్, పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది.
  7. విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తూ దేశీ ఉత్పత్తులకు మద్దతుగా 1900 ప్రారంభంలో బాల గంగాధర్ తిలక్‌తో కలసి సర్ రతన్ జంషెడ్ టాటా.. బొంబే స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కో లిమిటెడ్‌ను స్థాపించారు. ప్రస్తుతం అది బోంబే స్టోర్‌గా సుప్రసిద్ధం.
  8. జాతీయ గీతంగా వందేమాతరానికి బదులు జన గణ మణ ను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్‌ లో వాయించడానికి వందేమాతరం కన్నా జన గణ మణ అయితే సులభంగా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ భావించారట.
  9. భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ ర్యాడ్‌క్లిఫ్ నిర్ణయించారు. ఈయన బ్రిటిష్ న్యాయ కోవిదుడు. భారత భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహనలేకుండానే ర్యాడ్‌క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు. అయన తన నిర్ణయంపై చనిపోయేంత వరకు బాధపడుతుండేవారని చెబుతారు
  10. ఇండియా’ (India) అనే పేరును ఇండస్ (సింధూ) నది నుంచి తీసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన సింధూ నాగకరితకు నిదర్శనంగా ఈ పేరును పెట్టారు.

Also Read:  Independence Day 2023 : మహాత్ముడి వెంట ఉన్నవారిలో ఆ 8 మంది మహిళలు చాల ప్రత్యేకం..