Maldives – Indian Army : మాల్దీవులలో భారత ఆర్మీ ఎందుకు ఉంది ? ‘ఆపరేషన్‌ కాక్టస్‌’ ఏమిటి ?

Maldives - Indian Army :‘‘మా గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోండి’’ ఇదీ భారత్‌కు మాల్దీవులు తాజాగా ఇచ్చిన అల్టిమేటం.

  • Written By:
  • Publish Date - January 15, 2024 / 02:22 PM IST

Maldives – Indian Army :‘‘మా గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోండి’’ ఇదీ భారత్‌కు మాల్దీవులు తాజాగా ఇచ్చిన అల్టిమేటం. ఇంతకీ మాల్దీవులలో ఇండియా ఆర్మీకి ఏం పని ? అక్కడికి మన సైన్యం ఎందుకు వెళ్లింది ? ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

మాల్దీవులలోకి ఇండియా ఆర్మీ తొలిసారిగా 1988 సంవత్సరంలో ఎంటరైంది. ఆ ఏడాది నవంబరు 3న తెల్లవారుజామున మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లుతుఫీ.. అప్పటి అధ్యక్షుడు మౌమూన్‌ అబ్దుల్ గయూమ్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు.  80 మందితో కూడిన కిరాయి సైన్యం శ్రీలంకకు చెందిన వాణిజ్య నౌకను హైజాక్‌ చేసి మాల్దీవుల రాజధాని మాలెకు చేరుకుంది. బీభత్సం సృష్టించింది. అధ్యక్షుడి భవనం దిశగా దూసుకెళ్లసాగింది. ఆ కిరాయి సైన్యం కొంతమంది మంత్రులు, పౌరులను బందీలుగా చేసుకుంది. ఈ టైంలోమాల్దీవులకు సాయం చేసేందుకు శ్రీలంక, పాకిస్థాన్‌, సింగపూర్‌ నిరాకరించాయి. సాయం చేయడానికి రెండు, మూడు రోజుల టైం పడుతుందని మాల్దీవుల ప్రభుత్వానికి అమెరికా తేల్చిచెప్పింది.  చివరకు బ్రిటన్ ప్రధానమంత్రి మార్గరెట్‌ థాచర్‌కు  మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్‌ అబ్దుల్ గయూమ్‌ సంప్రదించారు. పక్కనే ఉన్న భారత్‌ను సాయం అడగాలని ఆమె సూచించారు. దీంతో వెంటనే అబ్దుల్ గయూమ్‌ భారత్‌ను సంప్రదించారు. అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. మన సైన్యాన్ని మాల్దీవులకు పంపించాలని నిర్ణయించారు. అలా ‘ఆపరేషన్‌ కాక్టస్‌’(Maldives – Indian Army) మొదలైంది.

Also Read: Flier Slapped Pilot : విమానం 13 గంటలు ఆలస్యం.. పైలట్‌పై ప్రయాణికుడి ఎటాక్

బ్రిగేడియర్‌ ఫారూఖ్‌ బల్సారా నేతృత్వంలో ఆగ్రా నుంచి మూడు పారాకమాండో బృందాలు మాలె అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. వెంటనే ఎయిర్‌పోర్టును తమ అధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి పడవల్లో మాలె నగరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక కిరాయి మూకలతో భారత సైన్యం భీకర పోరు సాగించింది. మన కమాండోల దెబ్బకు వారు తోకముడిచి పారిపోయారు.భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ గోదావరి, ఐఎన్‌ఎస్‌ బెత్వా.. ఆ కిరాయి సైన్యం ప్రయాణిస్తున్న నౌకను అడ్డగించి వారిని పట్టుకున్నారు. ఈ పోరులో ఇద్దరు బందీలు ప్రాణాలు కోల్పోగా.. మరో 17 మంది శ్రీలంక కిరాయి ముఠా సభ్యులు హతమయ్యారు. భారత్‌ అదుపులోకి తీసుకున్న శ్రీలంక కిరాయి ముఠా సభ్యులను 1989లో మాల్దీవులకు అప్పగించారు.

తిరుగుబాటు వెనుక ఆయన..

తిరుగుబాటు వెనుక మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహిమ్‌ నజీర్‌ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి.అయితే మాల్దీవుల స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని అధ్యక్షుడు గయూమ్‌ క్షమాభిక్ష ప్రసాదించారు. ఆనాటి నుంచే దాదాపు 70 మందితో కూడిన భారత సైన్యం మాల్దీవులలో విధులు నిర్వర్తిస్తోంది. మన సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి. భారత సైన్యాన్ని వెనక్కి పిలుచుకోవాలని మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయిజ్జు కోరడం వివాదానికి తెరతీసింది.