Brain: మెదడులో న్యూరాన్ల పరస్పర మెసేజింగ్ ఎలా జరుగుతుంది ? తెలుసుకునేందుకు ఇండియన్ అల్గారితం!

మెదడు రహస్యాల పుట్ట. అది పనిచేసే తీరు నేటికీ పెద్ద మిస్టరీయే. న్యూరాన్లు అనే అతిసూక్ష్మ పరిమాణంలోని నాడీ కణాలు పరస్పరం ఒకదాని నుంచి మరో దానికి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 07:00 AM IST

మెదడు రహస్యాల పుట్ట. అది పనిచేసే తీరు నేటికీ పెద్ద మిస్టరీయే. న్యూరాన్లు అనే అతిసూక్ష్మ పరిమాణంలోని నాడీ కణాలు పరస్పరం ఒకదాని నుంచి మరో దానికి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి. ఎంతో సమన్వయంతో పనిచేస్తూ.. శరీర భాగాలకు ఆదేశాలను జారీ చేస్తాయి. స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంటాయి.

మెదడులో ఎంతో గజిబిజిగా.. అత్యంత సంక్లిష్టంగా అల్లుకుపోయి ఉండే న్యూరాన్ల కనెక్షన్ల గురించి, వాటి అంతర్గత పనితీరును తెలుసుకునే ప్రత్యేక అల్గారితం ను బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) పరిశోధకులు అభివృద్ధి చేశారు. మెదడులోని వివిధ భాగాల మధ్య సమన్వయం ఎలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని అంటున్నారు. శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారితం.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) ఆధారిత మెషీన్ లెర్నింగ్ తో పనిచేస్తుంది.

ఇది మెదడులోని న్యూరాన్ల స్కానింగ్లను తీసి విశ్లేషిస్తుంది. సాధారణ అల్గారితం కంటే 150 రెట్లు వేగంగా ఇది న్యూరాన్ల స్కానింగ్ చేయగలదు. మెదడులోని వివిధ భాగాల్లో ఉండే న్యూరాన్ల పనితీరును విడివిడిగా విశ్లేషించడానికి ఈ స్కానింగ్ నివేదికలు దోహదం చేస్తాయని పరిశోధకులు వివరించారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “జర్నల్ నేచురల్ కంప్యుటేషనల్ సైన్స్” లో ప్రచురితం అయింది. అధ్యయన బృందానికి ఐఐఎస్సి లోని సెంటర్ ఫర్ న్యూరో సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ దేవరాజన్ శ్రీధరన్ నేతృత్వం వహించారు.