Linga Bhairavi Temple : హిందూ దేవాలయంలో పూజారులుగా దాదాపుగా పురుషులే ఉంటారు. అందులోనూ బ్రాహ్మణులే ఉంటారు. ఇతర పురుషులు, స్త్రీ లకు ఆలయంలోకి వెళ్లి పూజచేసే అవకాశం ఉండదు. అలాంటిది ఒక ఆలయంలో ఒక మహిళ పూజారిగా ఉంది. పైగా ఆమె మన దేశానికి చెందిన స్త్రీ కాదు. హిందూ మతమూ కాదు. లెబనాన్ కు చెందిన ఒక క్రిస్టియన్ మహిళ.. అమ్మవారి సేవలో పాల్గొని తరిస్తోంది. కోయంబ్తూలో ఉన్న ఈశా యోగకేంద్రంలో గల లింగభైరవి ఆలయంలో బైరాగిణి మా హనీనే పూజారిగా ఉంటోంది. లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగాన్ని, ఇంటిని, తన దేశాన్ని, మతాన్ని వదిలేసి.. హిందూ సంప్రదాయాన్ని, సంస్కృతిని మనస్ఫూర్తిగా స్వీకరించింది. ఇంతకీ ఎవరీ మా హనీనే. ఆమె ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుందో తెలుసుకుందాం.
భైరాగిణి మా హనీనే లెబనాన్ లో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసేది. అక్కడి నుంచి వచ్చిన ఆమె మనదేశంలో పూజారిగా మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేందుకు.. అంతర్గత పరిపూర్ణతను వెతికేందుకు తన విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నపుడు మా హనీనే వయస్సు కేవలం 25 సంవత్సరాలు. లెబనాన్ కు చెందిన ఈమె 2009లో ఫుల్ టైమ్ వాలంటీర్ గా పనిచేసేందుకు ఇక్కడికి వచ్చింది. అప్పటి నుంచీ ఆమె ఆ ఆలయంలోనే పూజారిగా ఉండిపోయింది.
ఆధ్యాత్మికత, యోగా అంటే ఏమిటో తనకు తెలియవట. తన సన్నిహిత మిత్రుడిని కోల్పోయినపుడు తనలో రేగిన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుండగా.. సద్గురు గురించి తెలిసింది. 2005లో ఈశా యోగా సెంటర్ అందించే ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ చేసింది. ఆ తర్వాత లెబనాన్ కు వెళ్లి ఉద్యోగానికి రిజైన్ చేసి.. తనకు కావలసిన దుస్తులు, సామాన్లు తీసుకుని ఇండియాకు వచ్చేసిందట. ఇక్కడ ప్రతి విషయంలో స్వచ్ఛందంగా సేవ చేయడం తనకెంతో నచ్చిందని మా హనీనే చెబుతోంది.
ఎవరీ భైరాగిణి మా ?
భైరాగిణి.. ఈ పదం లింగ భైరవి దేవి ఆలయంలోని పూజారులకు సంబంధించిన పదం. భైరాగిణి అంటే దేవి రంగు అని, సకల గుణాల ప్రతిబింబం అని భైరాగిణి మా హనీనే చెబుతోంది. తాను భైరాగిణి కాబట్టి ఎప్పుడూ ఎరుపు రంగు చీరనే ధరిస్తున్నట్లు మా హనీనే చెబుతోంది. క్రైస్తవురాలిగా పుట్టినా.. తమకు ఈ ఆచారాలు, సంప్రదాయాలు లేవని.. హిందూ సంస్కృతిలో ఉన్న ఈ ఆచారాలను తానెప్పటికీ అర్థం చేసుకోలేనని తెలిపింది. కేవలం అనుభవంతోనే అవి అర్థమవుతాయని చెప్పింది. తాను మతం మారకుండానే ఇందులోకి వచ్చినట్లు వివరించింది. తన కుటుంబం ఇందుకు చాలా సపోర్ట్ గా నిలిచిందని పేర్కొంది. భైరాగిణిగా మారకముందు ప్రతి విషయానికి కోపంగా, చిరాకుపడుతూ ఉండే నేను.. ఇప్పుడు ప్రశాంతంగా ఉండటాన్ని చూసి ఫ్యామిలీ సైతం ఆశ్చర్యపోతోందని తెలిపింది. ఈశా యోగా కేంద్రంలో వెల్లియంగిరి పర్వతాలకు దిగువన ఉన్న మా లింగభైరవి ఆలయంలో మా హనీనే మహిళా పూజారి. ఇక్కడ మహిళా పూజారులకు మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేసే అవకాశం ఉంటుంది.