High Speed Journey: హైస్పీడ్ రైలు వచ్చేస్తోంది.. ఇక హైదరాబాద్ – వైజాగ్ జర్నీ నాలుగు గంటలే..!

ఇక ఎప్పుడో రాత్రి పట్టాలెక్కి.. తర్వాత రోజు ఎప్పటికో ఎండ వచ్చిన తర్వాత ట్రైన్‌ దిగే రోజులకు రానురాను ఎండ్‌కార్డ్‌ పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే..

Published By: HashtagU Telugu Desk
High Speed Train Is Coming.. Hyderabad Vizag Journey Is Only Four Hours..!

High Speed Train Is Coming.. Hyderabad Vizag Journey Is Only Four Hours..!

పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయిందానన్న అనుమానం కలుగుతోంది. సాంకేతికతో మనుషుల మధ్య దూరమే కాదు.. ప్రాంతాల మధ్య కూడా దూరం తగ్గిందేమోనన్న డౌట్ వస్తోంది.. అయితే తగ్గింది దూరం కాదు.. పెరిగింది వేగమన్న విషయం ఆ వెంటనే అర్థమవుతోంది. ఇక ఎప్పుడో రాత్రి పట్టాలెక్కి.. తర్వాత రోజు ఎప్పటికో ఎండ వచ్చిన తర్వాత ట్రైన్‌ దిగే రోజులకు ఎండ్‌కార్డ్‌ పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడంతా హై స్పీడ్ (High Speed) కాలం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ హై స్పీడ్ రైలు (High Speed Train) కారిడార్‌పై తుది కసరత్తు జరుగుతోంది.

వేగం.. తగ్గేదే లే:

హై స్పీడ్ (High Speed) కారిడార్‌లో రెండు మార్గాలను ప్రతిపాదించారు. అందులో ఒకటి హైదరాబాద్ నుంచి విశాఖకు (Hyderabad – Vizag), రెండోది కర్నూలు నుంచి విజయవాడకు.. ఈ రెండు రూట్లలో ట్రైన్ దూసుకుపోయేలా ప్లాన్ రెడీ ఐపోయింది. ఈ కారిడార్లలో గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో రైలు రయ్‌మనిపించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీరింగ్.. ట్రాఫిక్ స్టడీ సర్వే ప్రారంభం కానుంది. ఈ హైస్పీడ్ కారిడార్‌లో 220 కిలోమీటర్ల వేగంతో ట్రైన్‌ వెళ్లేలా కొత్త లైన్లను నిర్మించాలనేది రైల్వే శాఖ ప్రతిపాదన. దీనికి సంబంధించి టెండర్లును ఇప్పటికే ఆహ్వానించారు. హై స్పీడ్ రైలు ఏ మార్గంలో అటు ప్రయాణీకులు..ఇటు రైల్వేకు ఆదాయం పరంగా కలిసి వస్తుందన్నదానిపై సర్వే నివేదిక ఇవ్వనుంది.

ఇక గంటల గంటలు కూర్చోవాల్సిన పనిలేదు:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజంగా ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాలుగంటే నాలుగు గంటల్లోనే చేరుకునేలా ఓ హైస్పీడ్ రైలు కారిడార్‌ ప్రాజెక్టుపై రైల్వే శాఖ పనిచేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం, విజయవాడ వెళ్లేందుకు వరంగల్ మీదుగా ఒకటి, నల్గొండ మీదుగా మరో మార్గం అందుబాటులో ఉన్నాయి. వరంగల్ రూట్ గరిష్ట సామర్థ్యం 150 కిలోమీటర్లు. అయితే, ఇప్పుడు ప్రతిపాదిత కారిడార్లలో గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలన్నది రైల్వేశాఖ ఆలోచన. రైల్వే కారిడార్ ఏ మార్గంలో ఉండాలన్న దానిపై ఆ సంస్థ ఆరు నెలల్లో ఓ నివేదిక సమర్పిస్తుంది. దీనిని బట్టి ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం విషయం తెలుస్తుంది. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందిస్తారు.

రైల్వే అధికారులు ఆలోచిస్తున్నదాని ప్రకారం.. హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్టణం మార్గం శంషాబాద్ మీదుగా ప్రారంభమవుతుంది. అయితే.. ఇది వరంగల్ మీదుగా ఉంటుందా? నల్గొండ, గుంటూరు మీదుగా ఉంటుందా? అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రాజెక్టులోని మరో మార్గం విజయవాడ-కర్నూలు మధ్య ఉంటుంది. ఇక హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి పట్టే 12 గంటల ప్రయాణ సమయం నాలుగు గంటలకు తగ్గుతుండడంతో దీనిపై సామాన్య ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

Also Read:  World Sleep Day: ప్రపంచ నిద్ర దినోత్సవం

  Last Updated: 17 Mar 2023, 12:50 PM IST