Political Giants : గెలుపు.. ఎవరికీ శాశ్వతం కాదు. ఓటమి.. ఎవరికీ శాశ్వతం కాదు. చరిత్రలోకి వెళితే మన దేశ ఎన్నికల బరిలో ఎంతోమంది మహామహులు(Political Giants) ఓటమిని చవిచూసిన సందర్బాలు ఉన్నాయి. అనూహ్యంగా ఇలాంటి చేదు అనుభవాలను దిగ్గజ నేతలు ఎదుర్కొన్న కొన్ని చారిత్రక సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- ఇందిరాగాంధీ ఆనాడు శక్తివంతమైన నాయకురాలిగా దేశంలో పేరుగాంచారు. మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీయే. అయితే 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేక పవనాలు వీచాయి. 1975 నుంచి 1977 సంవత్సరం వరకు దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని అమలు చేశారు. ఆ ప్రభావం 1977 ఎన్నికల్లో ప్రతిబింబించింది. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో సోషలిస్టు పార్టీ ప్రముఖుడు, రాం మనోహర్ లోహియా సన్నిహితుడు రాజ్ నారాయణ్ చేతిలో ఇందిరాగాంధీ ఓడిపోయారు.ఇది భారత ఎన్నికల చరిత్రలోనే సంచలన ఫలితంగా నిలిచిపోయింది.
-
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్.. బీజేపీ దిగ్గజ నేత. ఆయన రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుగాంచారు. విద్వేష వ్యాఖ్యలకు వాజ్‌పేయ్ దూరంగా ఉండేవారు. అయినప్పటికీ ఆయనకు ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 1984లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసిన వాజ్‌పేయ్‌ను కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రెండు లక్షల పై చిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. గ్వాలియర్‌లోనే వాజ్‌పేయ్ జన్మించారు. 1940వ దశకంలో గ్వాలియర్‌లోని ఆర్య సమాజ్‌లో సభ్యుడిగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.
-
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చాలా గొప్ప లీడర్. మన దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని అయింది ఆయనే. ప్రధాని అయిన ఒకేఒక్క తెలుగువాడు పీవీ. 1984 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. వాటిలో ఒకటి తెలంగాణలోని హన్మకొండ లోక్‌సభ స్థానం. అక్కడ పీవీపై బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి గెలిచారు. ఇందిరాగాంధీ మరణం అనంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తినా.. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పీవీ మాత్రం ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పీవీ జన్మించారు.
- రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మన దేశానికి చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలిపిన ఘనత కచ్చితంగా అంబేద్కర్‌దే. 1951–52లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నార్త్ బాంబే లోక్‌సభ స్థానం నుంచి అంబేడ్కర్ పోటీ చేశారు. అయితే ఆయనకు ఆశించిన ఫలితం రాలేదు. అక్కడ ఆయన నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. నార్త్ బాంబే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ బాలకృష్ణ గాంధీ గెలిచారు.
Also Read :Rahul Gandhi : రాయ్‌బరేలీ బరిలో రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ వ్యూహమేంటి ?
- దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అయిన రెండో దిగ్గజ నేత దేవెగౌడ. కర్ణాటక కేంద్రంగా పనిచేసే జేడీఎస్ పార్టీ ఆయనదే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన టైంలో దేవెగౌడ చక్రం తిప్పి, ప్రధానమంత్రి సీటును దక్కించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఆయన జాతీయ రాజకీయాల నుంచి వైదొలగి.. కర్ణాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. అటువంటి రాజకీయ పలుకుబడి కలిగిన దేవెగౌడ కూడా ఎన్నికలలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2004లో కర్ణాటకలోని కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవెగౌడను కాంగ్రెస్ నేత తేజస్వినీ గౌడ రమేశ్ ఓడించారు. దేవెగౌడపై ఆయన ఏకంగా లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీని సాధించారు.