Guyana Vs Venezuela : మరో యుద్ధం.. గయానా వర్సెస్ వెనెజులా.. ఎందుకు ?

Guyana Vs Venezuela : గయానా.. ఇది దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశం.

  • Written By:
  • Updated On - December 12, 2023 / 08:08 AM IST

Guyana Vs Venezuela : గయానా.. ఇది దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశం. ఈ దేశంలోని ఎసెక్విబో ప్రాంతంలో ఉన్న చమురు నిల్వలు, సహజ వనరులపై  వెనెజులా కన్నేసింది. ఈ ప్రాంతం వందేళ్లుగా గయానా ఆధీనంలోనే ఉంది. ఎసెక్విబో ప్రాంతం తమదే అని దశాబ్దాలుగా వెనెజులా వాదిస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రాంతం కోసం యుద్ధం చేసేందుకైనా రెడీయే అని చెబుతోంది. 2015 సంవత్సరం నుంచి ఎసెక్విబో ప్రాంతంలో జరిపిన అన్వేషణలో 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు బయటపడ్డాయి. మరోవైపు  గయానా-వెనెజులా మధ్య ఉన్న ఎసెక్విబో వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు నడుస్తోంది.

ఆర్థిక సంక్షోభంలో వెనెజులా..

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెనెజులా ఈ చమురు నిల్వలపై కన్నేసింది. తన  సైనిక శక్తితో ఎసెక్విబోను స్వాధీనం చేసుకునేందుకు వెనెజులా ఆర్మీ సన్నాహాలు మొదలుపెట్టింది. దీంతో గయానా తరపున అమెరికా ఆర్మీ రంగంలోకి దిగింది. గయానా సైన్యంతో కలిసి వెనెజులా బార్డర్‌లో సైనిక విన్యాసాలు చేసింది. దట్టమైన అడవులతో ఉండే ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు ఏకైక రూట్. లేదంటే బ్రెజిల్‌ గుండా వెళ్లాల్సి ఉంటుంది. కానీ బ్రెజిల్ తమ భూభాగం నుంచి వెళ్లనివ్వబోమని వెనెజులాకు తేల్చి చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎసెక్విబో ప్రాంతాన్ని గయానా నుంచి స్వాధీనం చేసుకోవాలా ? వద్దా ? అనే దానిపై వెనెజులా అధ‌్యక్షుడు నికోలస్ మాడురో తమ దేశంలో రెఫరెండం నిర్వహించారు. అయితే ప్రజల్లో 95 శాతం మంది ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఎసెక్విబో ప్రాంతాన్ని సైనిక చర్యతో స్వాధీనం చేసుకునేందుకు వెనెజులా ప్రజలు సమ్మతి తెలిపారు. ఈ రెఫరెండం పూర్తయిన వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో(Guyana Vs Venezuela) నూతన రాష్ట్రంగా చూపుతూ కొత్త మ్యాపులను వెనెజులా సర్కారు రిలీజ్ చేసింది.

డిసెంబర్‌ 14న వెనెజులా అధ్యక్షుడు మాడురోతో గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ భేటీ కానున్నారు. ఈ మీటింగ్ తర్వాత యుద్ధం జరుగుతుందా ? జరగదా ? అనే దానిపై క్లారిటీ వస్తుంది. వాస్తవానికి ఎసెక్విబో ప్రాంతానికి సంబంధించిన వివాదాన్ని ఇక వదిలేస్తున్నామని 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ ప్రకటించారు.దీంతో పదేళ్ల పాటు గయానా, వెనెజులా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకోలేదు. కానీ ఎసెక్విబోలో చమురు నిక్షేపాలు ఉన్నట్టు 2015లో బయటపడ్డాక.. వెనెజులా వాదన మారిపోయింది.