Site icon HashtagU Telugu

Gagaul – No To Dussehra : 166 ఏళ్లుగా దసరా వేడుకలకు దూరంగా ఆ ఊరు.. ఎందుకు ?

Gagaul No To Dussehra

Gagaul No To Dussehra

Gagaul – No To Dussehra :  దేశవ్యాప్తంగా గ్రామగ్రామాన ప్రతి సంవత్సరం దసరా వేడుకలు జరుగుతుంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా గగోల్‌ గ్రామస్థులు గత 166 ఏళ్లుగా దసరా వేడుకలను జరుపుకోవడం లేదు. ఎందుకో తెలుసా ? ఈవివరాలు తెలియాలంటే.. ఆంగ్లేయులపై 1857లో జరిగిన  మొదటి సిపాయీల తిరుగుబాటు గురించి తెలుసుకోవాలి. 1857లో ఒకరోజున  గగోల్‌, దాని పరిసర గ్రామాలైన పంచ్లి, నంగ్లా, ఘాట్, గుమి, నూర్‌నగర్, లిసందికి చెందిన ప్రజలు సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి ధన్‌ సింగ్‌ నేతృత్వంలో మీరట్ జైలుపై దాడి చేశారు. జైలు అధికారులు, సిబ్బందిని బంధించి.. అందులో ఉన్న బందీలను(Gagaul – No To Dussehra) విడిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ స్వాతంత్య్ర సంగ్రామాన్ని బ్రిటీషర్లు క్రూరంగా అణచివేశారు. ప్రజలను భయకంపితులను చేసేందుకు.. సరిగ్గా విజయ దశమి రోజున తొమ్మిది మంది భారత విప్లవకారులు రామసహాయ్, హిమాత్ సింగ్, రమణ్ సింగ్, హర్జీత్ సింగ్, కేదార సింగ్, ఘసితా సింగ్, షిబాత్ సింగ్, బైరామ్, దర్యాబ్ సింగ్‌లను గగోల్‌ గ్రామంలోని రావి చెట్టుకు ఉరి తీశారు. ఈ విషాద ఘటనను గుర్తుచేసుకుంటూ ఆనాటి నుంచి గగోల్‌ గ్రామస్తులు దసరా పండుగను జరుపుకోవడం లేదు. పండుగ రోజు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుంటారు. అమరవీరులను స్మరించుకుంటూ ఆ రోజంతా సంతాపం పాటిస్తారు. గగోల్ ప్రజల దేశభక్తి అనన్య సామాన్యం. ప్రతి భారత పౌరుడికి గగోల్ గ్రామవాసులు ఆదర్శప్రాయులు.

Also Read: Devaragattu Stick Fight : కర్రల సమరం రక్తసిక్తం.. ఇద్దరి మృతి, 100 మందికి గాయాలు