Manmohan Singh Birthday : ఈరోజు (సెప్టెంబర్ 26) మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ 91వ బర్త్ డే. 1932లో ఇదే రోజున పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఆయన జన్మించారు. వాస్తవానికి మన్మోహన్ ఒక ఆర్థికవేత్త. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి దేశ ప్రధాని అయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత.. రెండు టర్మ్ లు వరుసగా ప్రధానిగా సేవలు అందించిన రికార్డు కేవలం మన్మోహన్ సింగ్ కు ఉంది. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి సిక్కు వ్యక్తి ఆయనే.
పేదరికంలో మన్మోహన్ సింగ్ బాల్యం..
మన్మోహన్ సింగ్ చిన్న వయసులో ఉండగానే తల్లిని కోల్పోయారు. దీంతో అమ్మమ్మ ఆయనను పెంచి పెద్ద చేసింది. మన్మోహన్ సింగ్ బాల్యం పంజాబ్‌లోని గాహ్ ప్రాంతంలో అత్యంత పేదరికంలో గడిచింది. అయినా ఆయన ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఆ గ్రామంలో కరెంటు, పాఠశాల కూడా ఉండేది కాదు. ఊరి నుంచి పాఠశాలకు వెళ్లేందుకు కిలోమీటర్ల దూరం మన్మోహన్ నడవాల్సి వచ్చేది. కిరోసిన్ లైట్ల వెలుగులో ఆయన చదువుకున్నారు.
Also read : TS High Court: ఆలేరు ఎమ్మెల్యే కు హైకోర్టు షాక్, 10 వేల జరిమానా!
పీవీ నరసింహారావు చొరవతో..
మన్మోహన్ సింగ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక పీవీ నరసింహారావు చొరవ ఉందని అంటారు. నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ ఆర్థిక మంత్రిగా చేశారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే మన్మోహన్ సింగ్ మన దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రారంభించారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలని 1962లోనే మన్మోహన్ కు జవహర్‌లాల్ నెహ్రూ ఆఫర్ ఇచ్చారు.కానీ మన్మోహన్ సింగ్ అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో ఆయన అమృత్‌సర్‌లోని ఒక కళాశాలలో లెక్చరర్ గా పనిచేసేవారు.
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్
మన్మోహన్ సింగ్‌ను యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా అంటారు. ఈ పేరుతో ఆయనపై ఓ పుస్తకం రాసి సినిమా సైతం తీశారు. 2004లో ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం హఠాత్తుగా వచ్చిన మాట నిజం. నిజానికి 2004లో NDA యొక్క ఇండియా షైనింగ్ నినాదం ఫ్లాప్ అయింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్లమెంటరీ పార్టీగా అవతరించింది. ఆ సమయంలో ప్రధాని పేరుపై ప్రశ్న తలెత్తింది. సోనియా గాంధీ ఇటలీ వనిత అనే ప్రచారం అప్పట్లో జరిగింది. దీంతో సోనియా గాంధీ ప్రధాని పదవిని చేపట్టేంందుకు నిరాకరించారు. ప్రధానమంత్రి పదవి కోసం అర్జున్ సింగ్, ప్రణబ్ ముఖర్జీల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఏ ఒక్కరికి పీఎం పోస్టు ఇచ్చినా కాంగ్రెస్ లో వర్గపోరు మొదలయ్యే ముప్పు ఉంటుందని ఆనాడు సోనియాగాంధీ భావించారు. అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ప్రధాని పోస్టుకు ఎంపిక (Manmohan Singh Birthday) చేశారు.