Site icon HashtagU Telugu

PM Modi : తొలిసారిగా మోడీకి ‘సంకీర్ణ’ పరీక్ష.. వాట్స్ నెక్ట్స్ ?

PM Modi Visit Russia

PM Modi :  13 ఏళ్లు గుజరాత్ సీఎంగా.. పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించిన తర్వాత తొలిసారిగా నరేంద్రమోడీ రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సంకీర్ణ సర్కారు(Coalition Government) నడుమ తొలిసారిగా ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు. 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ముఖచిత్రం మారడంతో ఆయనకు ఈ కొత్త అనుభవం ఎదురైంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) కూటమికి మెజారిటీ వచ్చినప్పటికీ.. బీజేపీకి వచ్చిన స్థానాలు, విపక్ష ఇండియా కూటమికి వచ్చిన స్థానాలతో సరిపోలుతాయి. ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను మోడీ(PM Modi) ఎదుర్కోవాల్సి రాలేదు.

We’re now on WhatsApp. Click to Join

గతంలో మూడు కొత్త నేర, న్యాయచట్టాలను ఆమోదించే క్రమంలో నిరసనకు దిగారనే సాకుతో ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.  రాబోయే ఐదేళ్లలో అంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే విపక్షం చాలా బలపడింది. ఆనాడు ఎంతోమంది విపక్ష ఎంపీలు లేకుండానే మూడు నేర, న్యాయచట్టాల బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదించారు.  ఇకపై ఆ ఛాన్స్ ఉండదు. బిల్లులను కూలంకషంగా చర్చించాల్సి ఉంటుంది. విపక్షానికి విధాన నిర్ణయాలలో తగిన పాత్ర ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లుల ఆమోదానికి ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలి. ఈ పరిణామాలు కేంద్ర సర్కారుపై, దానికి సారథ్యం వహిస్తున్న మోడీపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. పార్లమెంటరీ కమిటీల పని తీరు కూడా మారనుంది. మారుతున్న సమీకరణాలను కలిపి చూస్తే.. బ్రాండ్ మోడీ క్షీణిస్తున్నాడని స్పష్టమవుతోందని పలువురు రాజకీయ పరిశీలకులు  అభిప్రాయపడుతున్నారు.

Also Read :Silver Prices: భారీగా పెరగనున్న వెండి ధరలు.. రూ. 1.25 లక్షలకు కిలో సిల్వర్..?

సీరియల్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్, అగ్నిపథ్ స్కీమ్, మణిపూర్ అనే మూడు అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికే కత్తులకు పదును పెడుతున్నాయి. ఇవన్నీ దేశంలోని బీజేపీకి కీలకమైన ఓటుబ్యాంకులోని సింహభాగాన్ని ఆలోచింపజేసే, ప్రభావితం చేసే అంశాలే. మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో బీజేపీ విఫలమైంది. ఈ పరిణామం అక్కడ కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు రెండు లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఒడిశా, ఏపీలలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇంతకుముందు ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్, ఏపీకి చెందిన వైఎస్సార్ సీపీ ఎన్డీయేకు మద్దతుగా నిలిచేవి. ఇప్పుడు ఆ రాష్ట్రాలలో ఇతర పార్టీలతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బిజూ జనతాదళ్, వైఎస్సార్ సీపీ విపక్షంలోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లోనూ గుడ్డిగా ఆ రెండు పార్టీలు ఎన్డీయే కూటమికే మద్దతు ఇస్తాయని ఎలా విశ్వసించగలం ? సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ సహా కీలక పదవుల్లోని వ్యక్తులను ఎన్నుకోవడంలో విపక్ష నేత పాత్ర కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ విపక్ష నేత స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు.  ప్రధాని మోడీ ఔనన్నా కాదన్నా.. రాహుల్‌తో సమావేశాలకు హాజరుకాక తప్పదు. ఈ అంశాలపై ఆయనతో చర్చించక తప్పదు.ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, సెప్టెంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒత్తిడి నడుమ ప్రధాని మోడీ(PM Modi) ఎలాంటి వ్యూహ రచన చేస్తారు ? ఎన్డీయే కూటమి ఎలాంటి ఫలితాలను సాధిస్తుంది ? అనేది చాలాకీలకం. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్షాలు బలంగా ఉన్నాయి. వాటి ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది.  ఈ ఉత్సాహం వాటికి కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.