Snehwan School: జల్నా, బీడ్, పర్బణి, వాశిమ్.. ఇవన్నీ మహారాష్ట్రలోని కరువు పీడిత జిల్లాలు. ఇక్కడి వార్తాపత్రికల్లో పతాక శీర్షికల వార్తలు రైతుల ఆత్మహత్యలే ఉంటాయి. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి ఉన్న కుటుంబాల్లోని పిల్లలను బడికి పంపడమంటే తల్లులకు తలకుమించిన భారమే. అలాంటి పిల్లల కోసమే 32 ఏళ్ల అశోక్ దేశ్ మణే అనే ఒక రైతు బిడ్డ లక్షల జీతమొచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి 2015లో స్నేహవాన్ ను స్థాపించాడు. రెండెకరాల ఆవరణలో అన్ని వయసుల పిల్లలూ పసుపుపచ్చ చొక్కా, నీలంరంగు ప్యాంట్ తో పొద్దుతిరుగుడు పువ్వుల్లా కనిపిస్తారు. ఆడుకుంటూనో, చెట్లకింద పుస్తకాలతో కుస్తీ పడుతూనో కనిపిస్తారు.
అశోక్ దేశ్ మణే తండ్రి కూడా.. జానెడు భూమిలో వ్యవసాయం చేస్తూ.. ఇంటిల్లిపాదిని పోషించలేక ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ బాధ మరొకరికి రాకూడదన్న ఉద్దేశంతోనే తండ్రిలేని రైతు బిడ్డల కోసం ఈ స్నేహవాన్ ను ప్రారంభించాడు. ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో.. పుణె జిల్లా ఖేడ్ తాలూకా చకన్ లో స్నేహవాన్ ఆవరణకు సంకల్పించాడు. అశోక్ స్వగ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోగా.. మృతుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచాడు. ఆ తర్వాత చాలామంది రైతు కుటుంబాల్లో అలాంటి పరిస్థితులే కనిపించాయి. ఆ పిల్లల జీవితాలను బాగుచేసేందుకు ఏదైనా మార్గం చూపించాలని సామాజిక సేవకుడు ప్రకాశ్ ఆమ్డేను కలిశాడు. ఆయన సలహాతో ఉద్యోగం వదిలేసి.. రెండు అద్దెగదుల్లో 15 మందితో స్నేహవాన్ ను ప్రారంభించాడు. మొదట్లో అబ్బాయిలకు మాత్రమే ఇక్కడ వసతి ఉండేది. ఆ తర్వాతి ఏడాది ఆడపిల్లకు కూడా స్వాగతం పలికారు.
స్నేహవాన్ లో విద్యార్థుల దినచర్య ఉదయం 6.30 గంటలకు ప్రార్థనతో మొదలవుతుంది. టిఫిన్లు చేశాక బడికి వెళ్తారు. 4వ తరగతి వరకూ ప్రభత్వ పాఠశాలలో.. ఆ తర్వాత 10వ తరగతి వరకూ ప్రైవేట్ స్కూల్ లో, ఇంటర్ కూడా ప్రైవేట్ కాలేజీలో చదివిస్తారు. స్నేహవాన్ ద్వారా చదువుకున్న విశాల్ శిందే ప్రస్తుతం హైదరాబాద్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ లో ఎమ్మెస్సీ చదువుతున్నాడు.
స్నేహవాన్ పిల్లల కోసం అశోక్ ఒక షిప్పింగ్ కంటెయినర్ లో 2000 ఇంగ్లీష్ పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. విద్యార్థులకు ఇంగ్లీష్ తో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందించడం కోసం ఒక ఎన్జీఓతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రతి పిల్లవాడు, బాలిక వారానికి ఒక పుస్తకమైనా చదవాలన్నది ఇక్కడి నియమం. అలా చదివినవారికే ఆదివారం స్నేహవాన్ ఆవరణలో ప్రదర్శించే సినిమా చూసే అవకాశం. చదవని వారికి సినిమా బంద్.
స్నేహవాన్ లో కేవలం విద్యే కాదు.. వ్యాపార మెళకువలు కూడా నేర్పిస్తారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ.. ఉద్యోగాలపైనే ఆధారపడకుండా.. పదిమందికీ జీవనోపాధిని కల్పించే సామర్థ్యాన్నీ సమకూరుస్తున్నారు. స్నేహవాన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న గోశాల ద్వారా పిల్లల రోజువారీ అవసరాలను తీరుస్తున్నారు. వంటకు బయోగ్యాస్ ను ఉపయోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తిని కూడా సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటారు. ఎంతోమంది పిల్లలకు స్నేహవాన్ ద్వారా చదువునిచ్చి.. జీవితానికి దారిచూపిస్తోన్న అశోక్ దేశ్ మణే నేటి యువతరానికి ఆదర్శం.
