Master Plan: టీడీపీ మహానాడు, కాంగ్రెస్ వరంగల్ సభల సక్సెస్ వెనుక సునీల్ కనుగోలు మాస్టర్ ప్లాన్!

టీడీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఒకటా రెండా మూడు లక్షల మందికి పైగా ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు... అందరూ కలిసి పార్టీ మహానాడు చివరిరోజున ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చారు.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 06:20 PM IST

టీడీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఒకటా రెండా మూడు లక్షల మందికి పైగా ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు… అందరూ కలిసి పార్టీ మహానాడు చివరిరోజున ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చారు. అంతమంది జనం వస్తారని పార్టీయే అంచనా వేయలేదు. కానీ లెక్కకుమించి పసుపుదండు తరలిరావడంతో పార్టీ అధిష్టానానికి ఉత్సాహం రెట్టింపయ్యింది. ఆమధ్య తెలంగాణలోని వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దానికి కూడా జనాలు భారీగా తరలివచ్చారు. మరి ఈ రెండు సభలు ఇంతలా సక్సెస్ కావడానికి, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సంబంధమేంటి?

ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ లేనిదే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా విజయం సాధించలేని పరిస్థితి నెలకొంది. పార్టీ పరంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా.. ఎన్నికల వ్యూహకర్తలు పకడ్బందీగా సర్వేలు చేయించి పక్కా సమాచారాన్ని పార్టీ అధిష్టానానికి ఇస్తారు. గెలుపు వ్యూహాలను రచిస్తారు. దానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయిస్తారు. దీంతో అన్ని పార్టీలు ఇప్పుడు వీళ్ల సేవలను పొందుతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్-పీకే ఈ విషయంలో ఫుల్ గా ఫేమస్ అయ్యారు. అదే కోవలో ఇప్పుడు సునీల్ కనుగోలు కూడా మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు. అందుకే అటు తెలంగాణ కాంగ్రెస్, ఇటు ఏపీలో తెలుగుదేశం పార్టీలకు విజయం సాధించిపెట్టడమే లక్ష్యంగా స్కెచ్ లు వేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభను చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే దానికి తగ్గట్టే జన సమీకరణ నుంచి వివిధ అంశాలపైనా పూర్తిగా ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగా తగిన వ్యూహాలను సునీల్ టీమ్ తయారుచేసి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనివల్లే సభ అంత బాగా జరిగిందని.. ప్రజలు కూడా భారీగా తరలివచ్చారని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పైగా ఆ సభ ముఖ్య ఉద్దేశాన్ని గ్రౌండ్ లెవల్లోకి తీసుకువెళ్లడానికి సునీల్ కుమార్ ఆలోచనలు బాగా ఉపయోపడ్డాయంటున్నాయి పార్టీ శ్రేణులు. అందుకే వివిధ ప్రాంతాలతోపాటు మందుషాపుల ముందు కూడా వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాలను ప్రదర్శించాలన్న ఆలోచన వచ్చింది కాంగ్రెస్ పార్టీకి.

టీడీపీ కూడా కొన్నాళ్ల కిందటివరకు రాబిన్ శర్మను ఎన్నికల వ్యూహకర్తగా నియమించింది. కానీ ఆయన నుంచి అనుకున్న అవుట్ పుట్ రాకపోవడంతో చంద్రబాబు ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. అందుకే వెంటనే ఆయన వేరే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కోసం గాలించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు సేవలందిస్తున్న సునీల్ కనుగోలు గురించి వాకబు చేశారు. ఆయననే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా నియమించారు. ఆయన వచ్చిన తరువాత పార్టీ తీరు మారిందని.. అది మహానాడు సభతో స్పష్టంగా కనిపించిందని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సునీల్ కనుగోలుది కర్ణాటకలోని బళ్లారి. తరువాత తమిళనాడులోని చెన్నైలో పెరిగారు. ఆపై ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కొన్నాళ్ల పాటు ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పనిచేశారు. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ పేరుతో ఏర్పాటుచేసిన సంస్థ ద్వారా ఆయన సేవలందిస్తారు. తమిళనాడులోని డీఎంకే పార్టీతోపాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో వివిధ పార్టీలకు ఆయన సేవలు అందించారు. కొన్నాళ్లపాటు టీఆర్ఎస్ కూడా ఆయన సేవలు పొందింది.