Site icon HashtagU Telugu

Congress : తెలంగాణలో కాంగ్రెస్‌ కొత్త ఉత్సాహంతో ఉరకలు..

Congress government is working hard for the implementation of the six guarantees

Congress government is working hard for the implementation of the six guarantees

Congress :  కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీల అమలు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. హైదరాబాద్‌ను కబ్జా చేసిన రియల్టర్లు, వారికి వత్తాసు పలికిన నాటి పాలకవర్గ ముఖ్యుల భరతం పట్టడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ‘హైడ్రా’ తో ఆక్రమణల కూల్చివేత, చెరువుల గుర్తింపు, వాటి పునరుద్ధరణ వంటి అంశాలపై ఇతర రాష్ట్రాలు,వాటి రాజధాని నగరాలు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలందుతున్నవి. హైడ్రా నిర్ణయాలు ‘కటువుగా’ ఉన్నట్టు విమర్శలు వెల్లువెత్తినా భవిష్యత్ తరాల కోసం ఇది ‘సృజనాత్మక’ చర్యగా మేధావులు, పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ‘ఫోర్త్ సిటీ’ పేరిట ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 168 నోటిఫైడ్‌ అయిన చెరువులు ఉన్నాయి. అవి ఇరవై నుంచి తొంభై శాతం వరకు కబ్జాకు గురయ్యాయి. వీటన్నింటికీ బౌండరీలు,హద్దులు,ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ పూర్తి స్థాయి నీటి మట్టం స్థిరీకరించి 30 ఫీట్లు అదనంగా నీటి నిలువను అంచనా వేస్తూ బఫర్‌ జోన్‌ను కూడా స్థిరపరిచారు. నిజానికి ఈ ఆక్రమణలు అన్ని తీసివేయాల్సిందే. అధికారులు,రాజకీయ నాయకులు,బిల్డర్లు,ప్రభుత్వ స్థలాలను అమ్మిన వాళ్లందరిపై ఏ చర్య తీసుకోకుండా వదిలేయడం సరైనది కాదంటున్నారు. పది సంవత్సరాలలో కబ్జాలు యథేచ్ఛగా జరిగిపోయాయి.గొలుసుకట్టు లింకులు,మూసీ నది ఆక్రమణలకు గురి అయ్యాయి.

లగచర్ల ఘటనతో ఫార్మా కంపెనీలు,ఇండస్ట్రియల్ పార్కులు వెనక్కి పోయినట్టేనని చాలామంది భావించారు. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఎలాంటి పరిస్థితిలోనూ వెనుకడుగు వేసేది లేదని శాసనసభలో స్పష్టం చేశారు.రీజనల్ రింగు రోడ్డు,ఫోర్త్ సిటీ వంటి వ్యవహారాల్లోనూ భూసేకరణ తప్పదని ఆయన చెప్పారు. కాగా,  గతంలో కేసీఆర్ పట్ల పార్టీలోని ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు ఇతర నాయకులు విధేయత చూపినట్లుగానే ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి చుట్టూ ఒక ‘కోటరీ’ ఏర్పడిందన్న ఆరోపణలున్నవి.ఈ ఆరోపణలు నిరాధారమని ముఖ్యమంత్రే స్వయంగా రుజువు చేసుకోవలసి ఉన్నది.

”గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులతో నడిచేవి. ఇప్పుడు డబ్బు మూటలతో నడుస్తున్నాయి. రేవంత్‌రెడ్డి అందుకు ఉపయోగపడకపోతే ఆ పదవి ఎప్పుడయినా ఊడుతుంది” అని బిఆర్ఎస్,బీజేపీ ఒకే స్వరంతో మాట్లాడుతున్నవి. కేసీఆర్ పాపాలు కాంగ్రెస్‌కు వరంగామారితే,కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేకపోవడం రేవంత్‌రెడ్డికి వరంగా మారిపోయిందని కొందరు ప్రచారం ప్రారంభించారు.తెలంగాణ దివాళా తీసిందన్న సంగతి అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. అదే నిజమైతే ఇక డబ్బు ఎక్కడి నుంచి సమీకరించడానికి వీలవుతుంది?మూటలు ఢిల్లీకి ఎలా మోయగలరు?

హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలను కబళించిన వారి నుంచి భూమి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది.’భూభారతి’ ద్వారా ఆ లెక్కలు తేలవచ్చు.’అనకొండ’ వలె భూములను మింగిన వారు,వారికి సహకరించి,ప్ప్రోత్సహించిన బిఆర్ఎస్ ప్రముఖులు,వారి వంద మాగధులు, ఏ స్థాయిలో ఉన్నవారయినా విడిచిపెట్టరాదని ప్రజలు కోరుతున్నారు.’హైడ్రా’ రికవరీ చేస్తున్న భూములలో వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అందులో వ్యాపార, వాణిజ్య స్థలాలు కూడా ఉన్నాయి.వాటిని ఏం చేస్తారు? అమ్మేస్తారా? లేక పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇస్తారా? ముందుగా ఉన్న చెరువులను యథాస్థితికి తీసుకొస్తారా? ఇప్పుడు అంతటి విస్తీర్ణం గల చెరువులు పునరుద్ధరించడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

సాధారణంగా ప్రజలకు నిజాలు ఎప్పుడూ రుచించవు.భ్రమల లోకంలో విహరించడానికే వాళ్ళు ఇష్టపడతారు. తెలంగాణ ప్రజల ‘సైకాలజీ’ ని కాచివడబోసిన కేసీఆర్ ప్రజలందరినీ ఎప్పుడూ,ఏదో ఒక మాయాజాలంలో కట్టిపడేస్తూ ఉండేవారు. జనానికి నగదు కనిపించాలి. అప్పుడే వాళ్ళు సంతోషిస్తారు.’నగదు బదిలీ పథకం’ లో భాగంగానే కళ్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్స్,రైతుబంధు,దళితబంధు,కులాల వారీగా హైదరాబాద్ లో భవనాలు…. ఇలా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారు. దాంతో జనం ‘ఒక అద్భుతమైన ప్రపంచం’ లో ఉన్నట్టుగా భావించి కేసీఆర్ ను తమ ‘దేవుడు’ గా పరిగణించారు. అలాంటి కేసీఆర్ ను మరిపించాలంటే రేవంత్ రెడ్డి చాలా కష్టపడవలసి ఉన్నది. ఆర్థికపరమైన సవాళ్లు రేవంత్ ముందరి కాళ్లకు బంధంగా మారిన మాట నిజం. ఆ సవాళ్ళను అధిగమించగలిగితే చాలావరకు ముఖ్యమంత్రి విజయం సాధించినట్లే.

 

ఎస్.కె.జకీర్,
సీనియర్ జర్నలిస్ట్.

Read Also: Assembly elections : నామినేషన్‌ దాఖలు చేసిన కేజ్రీవాల్‌