Site icon HashtagU Telugu

Chanakya Strategies Mukesh: ‘సెఫాలజిస్ట్’ ఓటర్ల మానసికతను ఎలా విశ్లేషిస్తారు?

Chanakya Mukesh

Chanakya Mukesh

నీటిలో మత్స్యయంత్రం ప్రతిరూపాన్ని చూస్తూ గురి కొట్టి బాణం వదిలిన అర్జునుడిలా ఫోకస్ వీరికి ఉంటుంది. కళ్లకు గంతలు కట్టుకుని గదాయుద్ధం చేసిన భీముడి బలం వీరిలో ఉంటుంది. దుర్యోధనుడి ఎత్తుగడలను ముందే పసిగట్టిన శ్రీ కృష్ణుడి తెలివి తేటలు వీరిలో కనపడతాయి. భవిష్యత్ చెప్పేసిన వీరబ్రహ్మేంద్రస్వామి ముందు చూపు వీరిలో ఉంటుంది. చూపులతో చదివేస్తారు.. మాటలను ఫిల్టర్ చేసేస్తారు. జనం బ్రెయిన్ లో ఏముందో స్కాన్ చేసేస్తారు. కోట్లాది ఓటర్లు, లక్షలాది రాజకీయ నేతలు, వందలాది పార్టీలు ఇవన్నీ ఒకే బుర్రలో పెట్టుకుని మరీ .. అపర చాణక్యుడిలా అంచనాలు వేసేవారు సెఫాలజిస్టులు. అలాంటి సెఫాలజిస్టుల్లో సక్సెస్ రేట్ ఉన్న రేరెస్ట్ పర్సనాలిటీ చాణక్య ముఖేష్.

ఢిల్లీ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లు బిజెపియే విజయం సాధించింది. అయితే బిజెపికి భారీగా వస్తాయని ఎక్కువమంది చెప్పారు. కొందరు మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుందని.. అయినా బిజెపి గెలుస్తుందని చెప్పారు. ఆ కొందరిలో ఒకరు చాణక్య స్ట్రాటజీస్. అవును వారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బిజెపి మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లే సాగింది. నెంబర్ చూస్తే బిజెపికి ఎక్కువ ఉన్నా.. చాలా చోట్ల తక్కువ మార్జిన్స్ తోనే ఆప్ అభ్యర్ధులు ఓడిపోయారు. కేజ్రీవాల్ సైతం 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మొన్నీ మధ్యే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ బిజెపి కూటమియే గెలుస్తుందని చెప్పారు. హర్యానాలోనూ అలాగే చెప్పారు. అంతకు ముందు ఏపీలో, తెలంగాణలో.. కర్నాటకలో.. రాష్ట్రం ఏదైనా చాణక్య స్ట్రాటజీస్ చెప్పిందే జరిగింది.

కర్నాటకలో బిజెపి ఓటమిని చాలామంది అంచనా వేయలేదు. కాని చాణక్య ముందే పసిగట్టింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిని కూడా చాలామంది ఎక్స్ పెక్ట్ చేయలేదు. కాంగ్రెస్ అధికారానికి వస్తుందని ఊహించనే లేదు. కాని చాణక్య చెప్పగలిగింది. ఏపీలో కూడా కూటమి విజయం తథ్యమని ముందే చెప్పింది.

ఇలా అంచనాలు వేయాలంటే మామూలు విషయం కాదు. ప్రజల దగ్గర సేకరించినా.. వారు మనసులో ఉన్నది చెబుతున్నారా.. లేక అబద్ధం చెబుతున్నారా పసిగట్టడమంటే బ్రెయిన్ లో చాలా వర్క్ జరగాలి. అది అంత ఈజీ అయితే కాదు. అందులో జనం ఇప్పుడు స్మార్ట్ అయిపోయారు.. కెమెరా ముందు ఒకలా.. విడిగా ఒకలా చెబుతారు.. చివరకు ఓటేసేటప్పుడు మరోలా చేస్తారు. దీంతో ఈ మధ్య సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చేయడం చాలా కష్టమైపోయింది. పైగా చాలామంది మనసు విప్పరు.. ఇంకా అనేకమంది నోరు కూడా విప్పరు. అయినా వారితో మాట్లాడే రెండు మూడు నిముషాల్లో అసలు విషయాన్ని స్మెల్ చేస్తారు సెఫాలజిస్టులు.

అలాంటి ఫైన్ అండ్ స్మార్ట్ సెఫాలజిస్టుల్లో చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ ఒకరు. ఆయన తెలుగువాడు.. పైగా తెలంగాణ వాసి. కాని నేడు ఇండియా మొత్తం చాణక్య పేరు మోగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన రోజు మనం చూస్తే ప్రతి నేషనల్ చానెల్ లో ఫస్ట్ వేసింది చాణక్య స్ట్రాటజీస్ రిపోర్ట్.. వారి పేరు అన్ని టేబుల్స్ లో ముందు వరుసలో ఉంది.

అయితే ఈ సక్సెస్ వెనక సీక్రెట్ గురించి అడిగితే చాణక్య ముఖేష్ మాత్రం ఓ నవ్వు నవ్వేసి ‘‘మాది టీమ్ వర్క్. ఢిల్లీలో మా వాళ్లు నెల నుంచి పని చేస్తున్నారు. మా అంచనాలు పోలింగ్ రోజో.. లేదా పోలింగ్ కు ముందు వారం రోజుల ముందు పరిస్ధితులు చూసి వేయం. మొదటి నుంచి ఢిల్లీ రాజకీయాలపై మా అబ్జర్వేషన్ ఉంటుంది. మేము ఎన్నికలప్పుడు సక్సెస్ కావాలంటే.. ఐదేళ్లూ అబ్జర్వ్ చేయాల్సిందే. ఏ నిర్ణయానికి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు.. దేనికి వ్యతిరేకత వస్తుంది.. దేనికి అనుకూలత వస్తుందనేది చూస్తూ ఉంటాం. అలాగే ఏ పార్టీ, ఏ నాయకుడు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారనేది చూస్తాం. అది వారి స్పీచుల్లో.. వారి మాటల్లో తెలుస్తూనే ఉంటుంది. మామూలు వాళ్లకు అది అర్ధం కాకపోవచ్చు. కాని మాకు అర్ధమవుతుంది. దానిని బట్టే ఆ నాయకుడు, ఆ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తుందో మేం అంచనా వేస్తాం. అలా కంప్లీట్ ఫాలో అయిన తర్వాత ఎన్నికలప్పుడు చేసే వర్క్ కలిస్తేనే.. మేం కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వగలం. ప్రతి చోట అలాగే చేస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో, అంతకు ముందు కర్నాటకలో చేశాం అంటే.. ముందు నుంచి అక్కడి రాజకీయాలను ఫాలో అయ్యాం కాబట్టే అక్కడ సక్సెస్ అవగలిగాం.’’

ఈ రోజుల్లో సోషల్ మీడియా, మీడియా మేనేజ్ మెంట్ ఎక్కువైపోయాయి. ప్రతి పార్టీ వీటి ద్వారా జనం మూడ్ ను మార్చేయాలని చూస్తున్నాం. కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి.. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. ఒకటి మాత్రం స్పష్టం.. ప్రజలు ఎన్నికలకు ముందే డిసైడ్ అయిపోతారు. ఈ జిమ్మిక్కులన్నీ రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండి, టైట్ ఫైట్ అయితేనే కొంచెం వర్కవుట్ అవుతాయి. లేదంటే అవకాశమే లేదని చాణక్య ముఖేష్ వివరించారు.
ఇక్కడ దృష్టి కోణం కీలకమంటున్నారు ముఖేష్. ప్రతి నాయకుడు ఒక యాంగిల్ లో ఆలోచిస్తారు. అలాగే చాలామంది ఎంత పెద్దవారైనా కూడా వారి కోరికకు, అంచనాలకు అనుగుణంగా పరిస్ధితులను అన్వయించుకోవాలని ప్రయత్నిస్తారు. దానికనుగుణంగా లాజిక్ తయారు చేసి చెబుతుంటారు. కాని వాస్తవాలు వేరుగా ఉంటాయి. అవి మేం చెప్పినా ఆ నాయకులు వినరు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఒకాయన అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో మేం చెప్పింది ఫాలో అయ్యారు.. విజయం సాధించారు. కాని అలా వినేవారు తక్కువ అంటూ ముఖేష్ తన అనుభవాన్ని చెప్పారు.

ఒకవైపు రాజకీయ నాయకులు గేమ్ ఆడుతుంటారు.. మరోవైపు ప్రజలు కూడా తెలివిగా మరో గేమ్ ఆడుతుంటారు. ఈ రెండు గేమ్స్ అర్ధం చేసుకుని.. అసలు గేమ్ ఏంటి.. ఎవరు విన్నర్ అనేది తేల్చడమే సెఫాలజిస్టుల పని. అంతే కాదు.. గేమ్ మార్చాలంటే గేమ్ ఛేంజర్ ఏంటనేది కూడా చెప్పగలిగేది సెఫాలజిస్టులే. మైండ్ రీడింగ్ అనేది ఎంత పవర్ ఫుల్ గా చేయగలిగితే సెఫాలజిస్టులు అంతగా సక్సెస్ అవుతారని ముఖేష్ అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో సక్సెస్ ఫుల్ సెఫాలజిస్టులు చాలా అరుదు. అలాంటి అరుదైన వారిలో ఒకరిగా మన తెలుగువాడు, తెలంగాణ వాసి చాణక్య ముఖేష్ ఒకరు అవడం మనకు గర్వకారణం. ఈ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగాలని.. జనానికి మేలు జరిగేలా రాజకీయ పార్టీలను, నాయకులను ప్రభావితం చేసేలా వారి సర్వేలు ఉండాలని ఆశిద్దాం.