APAAR Card : ‘అపార్’ కార్డు గురించి తెలుసా ? ఇవీ ప్రయోజనాలు

APAAR Card : ఆధార్ కార్డు గురించి మనకు తెలుసు. ‘అపార్’ కార్డు గురించి తెలుసా ? 

Published By: HashtagU Telugu Desk
Apaar Card

Apaar Card

APAAR Card : ఆధార్ కార్డు గురించి మనకు తెలుసు. ‘అపార్’ కార్డు గురించి తెలుసా ?  అపార్ అంటే.. ‘ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ’. దీన్నే ‘వన్ నేషన్.. వన్ స్టూడెంట్ ID కార్డు’ అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ డిజిటల్ ఐడీ కార్డును రూపొందించారు. ఇందులో భాగంగా విద్యార్థులందరికీ లైఫ్ టైం కోసం ఒక ప్రత్యేకమైన 12 అంకెల ఐడీ నంబర్‌ను కేటాయిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

జాతీయ విద్యా విధానం -2020 అమలులో భాగంగా ఈ ఐడీ కార్డును విద్యార్థులకు జారీ చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికీ స్కూల్స్​, కాలేజీలు ఈ అపార్ కార్డును జారీ చేస్తాయి. ఒక స్కూల్​ నుంచి మరొక స్కూల్​కు విద్యార్థులు బదిలీ కావడాన్ని ఈ కార్డులోని సమాచారం సులభతరం చేస్తుంది. ఈ కార్డులో విద్యార్థుల విద్యా ప్రమాణం, విజయాలు, స్కాలర్ షిపులు, డిగ్రీలు, రివార్డులు, ఇతర విద్యా క్రెడిట్​లకు సంబంధించిన అకడమిక్ డేటా మొత్తం డిజిటల్ రూపంలో నమోదై ఉంటుంది.

అపార్ కార్డులను(APAAR Card) జారీ చేసేందుకు కేంద్ర విద్యాశాఖ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)ని ప్రారంభించింది. ఇది ఎకో సిస్టమ్ రిజిస్ట్రీగా పనిచేస్తుంది. ఇందులో రిజిస్టర్ చేసుకునేందుకు తొలుత ఏబీసీ బ్యాంక్ వెబ్​సైట్​ను సందర్శించాలి. ఆ తర్వాత ‘మై అకౌంట్’పై.. అందులోని ‘స్టూడెంట్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డిజిలాకర్ అకౌంట్‌ను తెరవడానికి ‘సైన్ అప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ విద్యార్థి మొబైల్ నంబర్, చిరునామా, ఆధార్ కార్డు వంటి వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ వ్యక్తిగత ఆధారాలను ఉపయోగించి డిజి లాకర్  అకౌంట్​కి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు కేవైసీ ధ్రువీకరణ కోసం ఏబీసీతో ఆధార్ కార్డు వివరాలను పంచుకోవడానికి.. డిజిలాకర్ మీ పర్మిషన్ అడుగుతుంది. ‘ఐ యాక్సెప్ట్’‌పై నొక్కాలి. అనంతరం విద్యార్థి చదువుతున్న పాఠశాల/యూనివర్సిటీ పేరు, తరగతి, కోర్సు మొదలైన విద్యావివరాలను ఎంటర్ చేయాలి.  చివరగా ఫారమ్​ను సబ్మిట్ చేస్తే.. అపార్ ఐడీ కార్డు క్రియేట్ అవుతుంది. అయితే విద్యాసంస్థలు ‘అపార్’ కార్డును జారీ చేసే ముందు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి.

  Last Updated: 13 Dec 2023, 12:21 PM IST