AP Justice: చెల్లి కోసం ఓ అన్న న్యాయపోరాటం…తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీకి యాత్ర..!!

ఆస్తులకోసం తోబుట్టువులను కూడా దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో...ఓ అన్న తన చెల్లెలికోసం పోరాటం సాగిస్తోన్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  • Written By:
  • Updated On - May 25, 2022 / 12:38 PM IST

ఆస్తులకోసం తోబుట్టువులను కూడా దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో…ఓ అన్న తన చెల్లెలికోసం పోరాటం సాగిస్తోన్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిచ్చి పిచ్చి చేష్టలతో సైకోలుగా మారి విధ్వంసాలకు పాల్పడే యువకులేకాదు…న్యాయబద్ధంంగా పోరాటమూ చేసేవాళ్లున్నారని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. బయటివాళ్లకు చిన్నదిగానే అనిపించవచ్చు…సమస్యను ఎదుర్కొంటున్న కుటుంబానికి మాత్రం అది జీవనపోరాటం. అవతలివాడు బలవంతుడైతే…ఒంటరిగానో…కుటుంబంతోడుతోనే యుద్దం చేయడం తప్ప మరోదారి ఉండదు. అందుకే ఎంతో సాహసోపేతంగా నందిగామ నుంచి ఢిల్లీకి ఎడ్లబండిపై న్యాయయాత్రకు బయలుదేరాడో సోదరుడు. ఈ కథనం జాతీయ సోదరులు దినోత్సవం నాడు వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…
అత్తింటి వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చింది చెల్లెలు. ఆమెను చూసి కుమిలిపోయాడు అన్న. కుటుంబ సభ్యులతో కలిసిపోరాడినా..న్యాయం జరగదని ఆ అన్నకు తెలుసు. తమ రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆవేదనతో తల్లితో కలిసి ఎడ్లబండిపై దేశ రాజధానికి ఢిల్లీకి పయనమయ్యాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామ యువకుడు నేలవెళ్లి నాగదుర్గారావు కన్నీటి గాథ ఇది. అత్తింటివేధింపులను ఎదుర్కొంటున్న తన చెల్లెలికి న్యాయం చేయాలని వేడుకుంటూ దుర్గారావు తల్లిని వెంటబెట్టుకుని ఈనెల 23న ముప్పాళ్ల నుంచి ఎడ్లబండిపై ఢిల్లీకి యాత్రను ప్రారంభించాడు. మంగళవారం ఖమ్మం జిల్లాలోకిప్రవేశించాడు. స్థానిక మీడియా అతన్ని కదిలించింది. దీంతో తనవ్యథను చెప్పుకొచ్చాడు. తన చెల్లెలు నవ్యతను నందిగామ మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ కు 2018లో వివాహం చేశామని చెప్పాడు. కట్నం 23లక్షలు, 320గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చినట్లు చెప్పాడు.

పెళ్లి జరిగినప్పటినుంచి తన భర్త సరిగ్గా చూసుకోవడం లేదని…అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని..దుర్గారావు తెలిపారు. దీనిపై చందర్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించి కేసులోఎలాంటి పురోగతీ లేకుండా చేశారని దుర్గారావు వాపోయాడు. దీంతో విసిగిపోయిన తాను ఆంధ్రప్రదేశ్ లో తమకు న్యాయం జరగదని భావించి…తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.