Site icon HashtagU Telugu

Borra Caves: బొర్రా గుహల అందాలు అదరహో.. ప్రతి ఒక్కరూ చూడదగిన టూరిస్ట్ డెస్టినేషన్!!

Borra Caves Imresizer

Borra Caves Imresizer

బొర్రా గుహలు ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్. సుమారు 150 మిలియన్ ఏళ్ల కిందట నీటి ప్రవాహం వల్ల.. సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఈ గుహలు ఏర్పడ్డాయి. గోస్తాని నది తన దారికి అడ్డువచ్చిన కొండను తొలచుకుంటూ ఏర్పచుకున్న దారే.. బొర్ర గుహలు. ఇవి విశాఖపట్నానికి 90 కిమీల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి. 1807లో విలియం కింగ్‌ అనే బ్రిటీష్‌ భౌగోళిక శాస్త్రవేత్త వీటిని కనిపెట్టారు.

50 వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు..

బొర్రా గుహలో జరిపిన తవ్వకాల్లో 30 వేల నుంచి 50 వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు లభించాయి. వీటి ఆధారంగా ఈ గుహల్లో మానవులు జీవించేవారని భావిస్తున్నారు. 1990లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ గుహలను స్వాధీనం చేసుకుని ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు. గుహ లోపల రంగు రంగుల విద్యుత్తు దీపాలను అలంకరించారు.బొర్రా గుహల మొత్తం విస్తీర్ణం 200 మీటర్లు. లోపలి దారి నేరుగా గోస్తాని నదికి చేరుతుంది. అయితే, ఆ దారి ప్రమాదకరం కావడంతో అధికారులు మూసివేశారు. సున్నపు రాయిపై నీరు ప్రవహించడం వల్ల ఎన్నో వింతైన కళారూపాలు ఏర్పడ్డాయి.

విశేషాలు..

• దేశంలో అత్యంత పొడవైన, లోతైన గుహలు ఇవే.
• ఈ గుహలో ఉన్న శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడిందని స్థానికులు చెబుతారు.
• గుహల పైభాగంలో వేలాడుతూ కనిపించే స్పటిక ఆకారాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
• ఈ గుహ 365 రోజులు చల్లగానే ఉంటుంది. మండే వేసవిలో సైతం ఈ గుహలో చల్లని వాతావరణం ఉంటుంది.

* దండకారణ్య – బొలంగిర్ – కిబుర్ రైల్వే ట్రాక్ ఈ గుహల మీదుగానే వెళ్తుంది.

రూట్ మ్యాప్..

బొర్రా గుహలకు వెళ్లేందుకు విశాఖపట్నం నుంచి రైలు, బస్సు సదుపాయాలున్నాయి. అరకులోయ కంటే ముందుగానే ఈ గుహలు వస్తాయి. అరకు వెళ్లే పర్యాటకులు తిరుగు ప్రయాణంలో వీటిని సందర్శించవచ్చు.

 

Exit mobile version