Federal Front: కాంగ్రెస్ ముక్త్ భార‌త్ ? బీజేపీ ముక్త్ భార‌త్ ?

ఎనిమిదేళ్ళ క్రితం కాంగ్రెస్ ముక్త్ భార‌త్ నినాదాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ అందుకుంది. దేశం నుంచి కాంగ్రెస్ ను పూర్తిగా తుడిచిపెట్టేయ‌డమే కాషాయ పార్టీ ల‌క్ష్యం. దానికి అనుగుణంగా న‌రేంద్ర మోడీ, అమిత్ షా ద్వ‌యం నానా ర‌కాల ప్ర‌యోగాల‌తో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించుకున్నారు.

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 07:30 AM IST

ఎనిమిదేళ్ళ క్రితం కాంగ్రెస్ ముక్త్ భార‌త్ నినాదాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ అందుకుంది. దేశం నుంచి కాంగ్రెస్ ను పూర్తిగా తుడిచిపెట్టేయ‌డమే కాషాయ పార్టీ ల‌క్ష్యం. దానికి అనుగుణంగా న‌రేంద్ర మోడీ, అమిత్ షా ద్వ‌యం నానా ర‌కాల ప్ర‌యోగాల‌తో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చి కాషాయ పార్టీ జెండా ఎగ‌రేశారు. ఇక అనేక రాష్ట్రాల్లో మెజారిటీ రాక‌పోయినా సామ దాన బేధ దండోపాయాల‌తో క‌మ‌లం పార్టీని విక‌సింప‌చేశారు. బెంగాల్, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలు బీజేపీతో సంబంధం లేకుండానే కాంగ్రెస్ నుంచి విముక్తి పొందాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్క‌డైతే కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందో…అక్క‌డంతా రాజ‌కీయ శూన్య‌త‌ను బీజేపీ భ‌ర్తీ చేసింది. ఉదాహ‌ర‌ణ‌కు చెప్పుకోవాలంటే బెంగాల్ లో మూడున్న‌ర ద‌శాబ్దాల పాటు పాలన సాగించిన సీపీఎం క‌నుమ‌రుగైంది. కాంగ్రెస్ అడ్ర‌స్ కోల్పోయింది. ఇక తృణ‌మూల్ కాంగ్రెస్ కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ నిల‌బ‌డింది బెంగాల్ రాష్ట్రంలో. తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చాణ‌క్యం, కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల ప‌ద‌వీకాంక్ష కార‌ణంగా ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇక ఏపీలో 2014లోనే అక్క‌డి ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు స‌మాధి క‌ట్టేశారు. బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భార‌త్ కు త‌న‌వంతు స‌హ‌కారం అందించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు బీజేపీ ముక్త్ భార‌త్ అంటూ నిన‌దిస్తున్నారు. మూడేళ్ళ క్రితం బ‌య‌ట‌కు తీసి త‌ర్వాత‌ అట‌కెక్కించిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను మళ్ళీ బ‌య‌ట‌కు తీసారు గులాబీ ద‌ళ‌ప‌తి.

2019లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల ముందు ఏపీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, తెలంగాణ‌లో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ లు ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్రంలో చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌ని ఆశించారు. బీజేపీ బ‌లం త‌గ్గిపోతే, స‌భ‌లో ఎవ‌రికీ మెజారిటీ రాక‌పోతే ఎవ‌రో ఒక‌రికి మ‌ద్ద‌తిచ్చి ఢిల్లీ పాల‌కుల్ని చెప్పుచేత‌ల్లో పెట్టుకోవ‌చ్చని అనుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల‌ను వ్య‌తిరేకించే పార్టీల‌తో దోస్తీ చేశారు. అయితే చంద్ర‌బాబు, కేసీఆర్ క‌ల‌లు ఫ‌లించ‌లేదు. బీజేపీ 2014 కంటే అత్య‌ధిక మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని స్వంతం చేసుకుంది. చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న తెలుగుదేశం పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. ఇక కేసీఆర్ రాష్ట్రంలో త‌న అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాలోక్ స‌భ సీట్లు అనుకున్న విధంగా రాలేదు. మొత్తంగా ఓడిపోయి చంద్ర‌బాబు, బీజేపీ బ‌లం పెరిగి, త‌న బ‌లం త‌రగ‌డంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ను దుంప నాశ‌నం చేస్తున్నామ‌న్న సంతోషంతో బీజేపీ బ‌లం పెరుగుతోంద‌నే విష‌యాన్ని కేసీఆర్ విస్మ‌రించారు. కాంగ్రెస్ స్థానాన్ని భ‌ర్తీ చేస్తున్న క‌మ‌లం పార్టీ గులాబీ పార్టీకి స‌వాళ్ళు విసురుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగ‌రేస్తామ‌ని ఢంకా భ‌జాయించి చెబుతోంది. దీంతో బీజేపీని ఢిల్లీ నుంచే న‌రుక్కురావాల‌ని నిర్ణ‌యించుకున్నారు కేసీఆర్.

2018 అసెంబ్లీ ఎన్నిక‌లపుడు, 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌క‌టించి వ‌దిలేసిన‌ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఆలోచ‌న‌ను మ‌ళ్ళీ బ‌య‌ట పెట్టారు. యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులోభాగంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యారు. బిహార్ ప్ర‌తిప‌క్ష పార్టీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యుడితో హైద‌రాబాద్ లో స‌మావేశ‌మ‌య్యారు. యూపీలో స‌మాజ్ వాదీ పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన నూత‌న బ‌డ్జెట్ ను కేసీఆర్ తూర్పారబ‌ట్టారు. ప‌నికిమాలిన బ‌డ్జెట్గా అభివ‌ర్ణించారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని మెద‌డులేని నాయ‌కులు న‌డుపుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. దేశాన్ని అమ్మ‌డం, మ‌త పిచ్చి లేప‌డం మిన‌హా బీజేపీ నాయ‌కుల‌కు ఇంకేమీ తెలియ‌ద‌ని, అస‌లీ రాజ్యాంగంలోనే త‌ప్పులున్నాయ‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగాన్ని స‌వ‌రించ‌డం కంటే కొత్త‌ది రాసుకోవ‌డం బెట‌ర్ అని కామెంట్ చేశారు కేసీఆర్. అవ‌స‌రాన్ని బ‌ట్టి, సంద‌ర్భాన్ని బ‌ట్టి బీజేపీని విమ‌ర్శిస్తూ, మ‌ళ్ళీ కొంత‌కాలం మౌనం పాటిస్తూ వ‌స్తున్న కేసీఆర్ ను విశ్వ‌సించి ఆయ‌న ఏర్పాటు చేసే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి వ‌చ్చే ప్రాంతీయ పార్టీలు ఎన్ని?

దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి చేయాల‌ని బీజేపీ ఎంత తాప‌త్ర‌య‌ప‌డినా, ప్రాంతీయ పార్టీలు ఎన్ని పాట్లు ప‌డినా కాంగ్రెస్ లేకుండా బీజేపీయేత‌ర ఫ్రంట్ సాధ్యం కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తేల్చిన విష‌యం. కేసీఆర్ కు కాంగ్రెస్ అంటే న‌చ్చ‌క‌పోయినా ప‌చ్చి వాస్త‌వం ఇది. కేసీఆర్ వెంట ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఆప్ నేత కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రావ‌చ్చు. కాని కేసీఆర్ కంటే మ‌మ‌తా సీనియ‌ర్ ముఖ్య‌మంత్రి, తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి. కాంగ్రెస్, వామ‌ప‌క్షాల‌ను ఖ‌తం చేశాక మోడీ, అమిత్ షాల‌ను ఎదురొడ్డి పోరాడి గెలిచిన బెంగాల్ పులి. అటువంటి మ‌హిళా నేత కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించ‌డం జ‌రిగే ప‌నికాదు. ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ త‌న రాష్ట్రం త‌ప్ప జాతీయ రాజ‌కీయాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు ఎవ‌రికీ తెలియ‌దు. ఇక త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్, బిహార్ ప్ర‌తిప‌క్షం లాలూయాద‌వ్ పార్టీ, మ‌హారాష్ట్రలోని శివ‌సేన‌, ఎన్సీపీలు కాంగ్రెస్ తో జ‌ట్టు కొన‌సాగిస్తున్నాయి. ఈ పార్టీలు కేసీఆర్ ను న‌మ్మి కాంగ్రెస్ ను వ‌దిలి వ‌స్తాయా అన్న‌ది అనుమాన‌మే. మ‌రోప‌క్క ఏపీ ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్ త‌నకున్న‌ అవ‌స‌రాల రీత్యా ప్ర‌స్తుతానికి బీజేపీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పే అవ‌కాశ‌మే లేదు. ఏపీ ప్ర‌తిపక్షం తెలుగుదేశం ప‌రిస్థితి కూడా అంతే. ఇప్ప‌టికీ దేశంలో బీజేపీ త‌ర్వాత అత్య‌ధిక ఎంపీ సీట్ల‌కు పోటీ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్ర‌మే. అయితే రాజ‌రిక ల‌క్ష‌ణాల‌తో త‌న పుట్టి తానే ముంచుకుంటోంది కాంగ్రెస్. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే కాంగ్రెస్ లేకుండా ముగ్గురు లేదా న‌లుగురు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో క‌లిసి కేసీఆర్ బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగిన కాషాయ పార్టీని దేశం నుంచి త‌రిమికొట్ట‌డం సాధ్య‌మేనా?

ఒక‌వేళ యూపీలో గ‌తంలో మాదిరిగా మూడింట రెండు వంతుల మెజారిటీతో బీజేపీ మ‌ళ్ళీ అధికారంలోకి వ‌స్తే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి కేసీఆర్ మ‌రోసారి మాట్లాడ‌తారా?