Site icon HashtagU Telugu

Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

Indelible Ink

Indelible Ink

Indelible Ink: మీరు కూడా దేశంలో జ‌రిగిన ఎన్నికలలో తప్పకుండా ఓటు వేసి ఉంటారు. ఆ సమయంలో మీ వేలికి నీలి రంగు సిరా (Indelible Ink) గుర్తు కూడా తప్పకుండా పడి ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో ఉపయోగించే ఈ నీలి సిరాను ఎవరు, ఎక్కడ తయారు చేస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కథనంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

నిజానికి ఓటు వేసిన తర్వాత ప్రతి వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలుకు ఈ నీలి సిరాను పెడతారు. ఈ సిరాను పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి మళ్లీ ఓటు వేయకుండా ఆపడం. ఎన్నికలలో జరిగే నకిలీ ఓటింగ్‌ను అరికట్టడం. ఒక గుర్తింపు చిహ్నంగా ఈ చెరగని సిరాను మీ వేలికి పెడతారు. ఈ నీలి సిరాను ఉపయోగించే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఇది ఎక్కడ తయారవుతుంది? మనం దీనిని చెరిపివేయవచ్చా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలక్షన్ ఇంక్ ఎలా తయారవుతుంది?

ఎలక్షన్ ఇంక్ లేదా నీలి సిరా అనేది సిల్వర్ నైట్రేట్, వివిధ రకాల రంగులు, కొన్ని ద్రావణాల కలయిక. సాధారణంగా ప్రజలు దీనిని ఎలక్షన్ ఇంక్ లేదా ఇండెలబుల్ ఇంక్ అని కూడా అంటారు. ఎవరైనా ఒక ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వారి ఎడమ చేతి చూపుడు వేలికి ఈ నీలి సిరా గుర్తును పెడతారు. ఇది ఓటర్ల చేతిపై చెరగని ముద్రను వదిలివేస్తుంది. ఈ సిరా సుమారు ఒక వారం పాటు ఓటరు చేతిపై ఉంటుంది. ఈ సిరా ప్రత్యేకత ఏమిటంటే వేలికి పెట్టిన కేవలం 40 సెకన్లలోనే ఇది పూర్తిగా ఆరిపోతుంది.

నీలి సిరా అవసరం ఎందుకు వచ్చింది?

దేశంలో మొట్టమొదటిసారిగా 1951-52లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో నకిలీ ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘానికి కొన్ని ఫిర్యాదులు అందాయి. ఈ నకిలీ ఓటింగ్‌ను అరికట్టడానికి ఓటు వేసిన ప్రతి ఓటరు వేలిపై ఒక సిరా గుర్తు పెట్టాలనే పరిష్కారాన్ని కనుగొన్నారు. దీని ద్వారా ఆ వ్యక్తి అంతకుముందే ఓటు వేశాడని తెలుస్తుంది. అయితే ఈ గుర్తును ఎవరూ సులభంగా చెరిపివేయలేని సిరాతో వేయాలనేది ఎన్నికల సంఘం ముందున్న సవాలు. దీని తరువాత ఈ ప్రత్యేకమైన సిరాను తయారు చేశారు.

Also Read: Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

ఈ సిరాను ఏ కంపెనీ తయారు చేస్తుంది?

ఈ నీలి సిరాను మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే సంస్థ తయారు చేస్తుంది. ఇది కర్ణాటక ప్రభుత్వం పీఎస్‌యూ సంస్థ. దేశంలోనే ఈ నీలి సిరాను తయారు చేయడానికి అధికారం పొందిన ఏకైక కంపెనీ ఇది. 1962 సంవత్సరం తరువాత దేశంలో జరిగిన అన్ని ఎన్నికలలో ఈ కర్మాగారంలో తయారు చేసిన సిరానే ఉపయోగిస్తున్నారు. గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికల నుండి లోక్‌సభ ఎన్నికల వరకు ఈ సిరాను వాడుతున్నారు.

ఎలక్షన్ ఇంక్ మొట్టమొదట ఎప్పుడు ఉపయోగించారు?

ఈ సిరాను మొట్టమొదటిసారిగా 1962 సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించారు. ఈ సిరాను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనం లేదా సహజ రంగు కూర్పును పూర్తిగా రహస్యంగా ఉంచుతారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికల సంఘమే రసాయన కూర్పును సిద్ధం చేసి కర్మాగారానికి అందిస్తుంది. కంపెనీ ఎండీ కుమారస్వామి మాట్లాడుతూ.. ఇందులో ఉపయోగించే రసాయనాలు, రంగు కూర్పును ఎన్నికల సంఘం నిర్ణయించిందని, ఇది 1962లో ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఉంటుందని తెలిపారు. దీనిని వేలుపై గోరు, చర్మానికి తాకించిన 40 సెకన్లలోనే దాని రంగు ముదురుగా మారుతుంది. ఒకసారి వేలికి అంటిన తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా ఇది పోదని కంపెనీ హామీ ఇస్తుంది.

సిరా తయారీ కర్మాగారం చరిత్ర ఏమిటి?

ఈ కంపెనీని మైసూర్ వడియార్ మహారాజు కృష్ణదేవరాజ్ 1937 సంవత్సరంలో స్థాపించారు. ఈ రాజవంశం ప్రపంచంలోని అత్యంత ధనిక రాజకుటుంబాలలో ఒకటిగా పరిగణించబడింది. వడియార్ మహారాజు కృష్ణరాజ్ స్వాతంత్య్రానికి ముందు ఇక్కడి పాలకుడు. 1937లో వడియార్ మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ అనే పేరుతో పెయింట్స్ మరియు వార్నిష్ కర్మాగారాన్ని తెరిచారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది.

సిరా ధర ఎంత?

ఒక సీసాలో 10 ఎంఎల్ సిరా ఉంటుంది. ప్రతి సీసా ధర రూ. 164గా నిర్ణయించబడింది. అయితే సిరా ధర దానిలో ఉపయోగించే ముడి పదార్థాల ధరపై ఆధారపడి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు ఎగుమతి

ఈ సిరా భారతదేశంతో పాటు మలేషియా, కంబోడియా, దక్షిణాఫ్రికా, మాల్దీవులు, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, పపువా న్యూ గినియా, బుర్కినా ఫాసో, బురుండి, టోగో సహా ఆసియా, ఆఫ్రికాలోని దాదాపు 30 దేశాలలో సాధారణ ఎన్నికలకు సరఫరా చేయబడింది. ఒక అంచనా ప్రకారం.. గత లోక్‌సభ ఎన్నికల్లో సుమారు రూ. 384 కోట్ల విలువైన సిరా ఉపయోగించబడింది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 3,000 లీటర్ల సిరాను ఉపయోగించారు.

Exit mobile version