Bathukamma 2023 : బతుకమ్మ వేడుకలకు వేళాయె.. 9 రోజుల పూల పండుగ విశేషాలివీ

Bathukamma 2023 : ఈరోజు నుంచే తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజు బతుకమ్మకు ఒక్కో పేరు ఉంటుంది.

  • Written By:
  • Updated On - October 14, 2023 / 07:43 AM IST

Bathukamma 2023 : ఈరోజు నుంచే తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజు బతుకమ్మకు ఒక్కో పేరు ఉంటుంది. అంటే మొత్తంగా 9 పేర్లను బతుకమ్మ కలిగి ఉంటుంది. ఈక్రమంలో బతుకమ్మకు 8 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తూ సాగే పూల ఉత్సవం బతుకమ్మ. ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడి పాడి, అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని పూజించి, అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

1.ఎంగిలిపూల బతుకమ్మకు ఆ పేరు ఎలా వచ్చింది ?  

బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చింది ? అంటే.. బతుకమ్మను పేర్చే ప్రక్రియ నుంచి వచ్చిందని చెప్పొచ్చు.  బతుకమ్మను అందంగా పేర్చడం ఒక కళ. పూల కాడలన్నీ సమానంగా ఉండేలా కత్తిరిస్తూ బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చే క్రమంలో పూల కాడల్ని కత్తెరతో గానీ, చేత్తో గానీ తీసేస్తారు. దానికి బదులుగా కొంతమంది నోటితో కాడల్ని తెంపి బతుకమ్మ పేర్చడం వల్ల ఈరోజుకు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అనే పేరు వచ్చిందని కొందరు అంటారు. ఒకరోజు ముందు సేకరించి తెచ్చిన పూలతో బతుకమ్మను పేరుస్తారు కాబట్టి.. పూలను ఒకరోజు నిద్ర తర్వాత వాడటం వల్ల కూడా ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అనే పేరొచ్చిందని ఇంకొందరు చెబుతుంటారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే ‘పెత్ర అమావాస్య’ కూడా వస్తుంది.  ఈ రోజు ఉదయం పెద్దల ఆత్మకు శాంతి కలగాలని తర్పనాలు ఇస్తారు. అలా ఉదయాన్నే కాస్త భోజనం చేసి.. అంటే ఎంగిలి పడి బతుకమ్మ పేరుస్తారు కాబట్టి ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అనే పేరొచ్చిందని మరికొందరు చెబుతారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజున అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. ఇంట్లో ముందుగా బతుకమ్మను పూజిస్తారు.

Also Read: Gold- Silver Rates: భారీగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..?

2.అటుకుల బతుకమ్మ

రెండో రోజు  అటుకుల బతుకమ్మ వేడుక ఉంటుంది. ఈరోజున  బతుకమ్మకు సప్పిడి పప్పు, బెల్లం , అటుకులు నైవేద్యంగా పెడతారు.

3.ముద్దపప్పు బతుకమ్మ

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుక ఉంటుంది.ఈ రోజున బతుకమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లంతో కలిపి నైవేద్యంగా పెడతారు.

4.నానబియ్యం బతుకమ్మ

నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ వేడుక ఉంటుంది. ఈరోజున బతుకమ్మకు నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా పెడతారు.

5.అట్ల బతుకమ్మ

ఐదో రోజు అట్ల బతుకమ్మ వేడుక ఉంటుంది.  ఈరోజున బతుకమ్మకు గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన అట్లను నైవేద్యంగా పెడతారు.

6.అలిగిన బతుకమ్మ

ఆరో రోజు అలిగిన బతుకమ్మ వేడుక ఉంటుంది. ఈరోజున బతుకమ్మను పేర్చరు.. ఎలాంటి నైవేద్యం పెట్టరు.

7.వేపకాయల బతుకమ్మ

ఏడో రోజు వేపకాయల బతుకమ్మ వేడుక ఉంటుంది. ఈరోజున బతుకమ్మకు  వేపచెట్టు పండ్ల ఆకారంలో ఉండే సకినాల పిండితో  వంటలు తయారు చేసి నైవేద్యంగా పెడతారు.

8.వెన్నముద్దల బతుకమ్మ

ఎనిమిదో రోజు  వెన్నముద్దల బతుకమ్మ వేడుక ఉంటుంది. ఈరోజున బతుకమ్మకు  నువ్వులు, వెన్నను నైవేద్యంగా పెడతారు.

9.సద్దుల బతుకమ్మ

తొమ్మిదో రోజు  సద్దుల బతుకమ్మ వేడుక ఉంటుంది. ఈరోజున పెరుగన్నం, చింతపండు పులిహోర , నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం,  నువ్వల సద్ది వంటకాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.