Bathukamma: బ‌తుక‌మ్మ పండుగ గురించి ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే..!

సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత దేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 06:00 PM IST

సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత దేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ.

ప్రకృతిని ఆరాధిస్తూ పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే ఆనందాల‌ వేదిక. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ప‌త్రి సంవ‌త్స‌రం పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. నేటి నుంచి (సెప్టెంబర్ 25) ఎంగిలిపూల బతుకమ్మతో ఈ సంబరాలు మొదలు కానున్నాయి. ఈ పండుగ నేపథ్యం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి..!

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. గుమ్మడి, తంగేడు, కట్ల పూలు, గోరంట్ల, గునుగు పూటు స్థూపాకారంలో వరుసలుగా పేర్చి పైభాగం మధ్యలో గౌరమ్మను పెడతారు. పువ్వులతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో అమ్మను పూజిస్తారు. బ‌తుక‌మ్మ‌లు మొత్తం తొమ్మిది రోజులు చేస్తారు. అయితే ఈ బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలు తెలంగాణ వీరుల కథల వరకు వర్తమాన అంశాలకు చెందిన విషయాలను పాటల రూపంలో పాడుతూ ఉంటారు.

మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు- అటుకుల బతుకమ్మ, మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు- అట్ల బతుకమ్మ, ఆరవ రోజు- అలిగిన బతుకమ్మ, ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు- వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ.