Robberies – Dussehra : దసరా పండుగ సెలవుల వేళ హైదరాబాద్ మహా నగరం నుంచి ఎంతోమంది తమతమ సొంతూళ్లకు వెళ్తుంటారు. దీంతో సిటీలోని పలు కాలనీలు నిర్మానుష్యంగా మారుతుంటాయి. దీన్ని అదునుగా తీసుకొని.. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు జరిగిన ఘటనలు గతంలో చాలా చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి వెళ్లే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీసులు సూచిస్తున్నారు.
శివారు ప్రాంతాలకు అలర్ట్..
ప్రత్యేకించి సిటీలోని శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, బాలానగర్, మల్కాజ్గిరి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ల పరిధిలోని ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని పోలీసులు కోరారు. ఈ ఏడాది సమ్మర్ టైంలో హైదరాబాద్ లో థార్, చెడ్డీ, పార్థీ గ్యాంగ్ తదితర కిరాతక ముఠాలు వరుస చోరీలకు పాల్పడటం కలకలం రేపింది. మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్, అల్వాల్, బొల్లారం పోలీస్ స్టేషన్లలో పార్థీ గ్యాంగ్ సభ్యుడు, రాచకొండ పరిధిలోని మేడిపల్లిలో మహారాష్ట్రకు చెందిన థార్ ముఠా హల్ చల్ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఊరెళ్తున్నారా ? పోలీసుల సూచనలివీ..
- ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం అమర్చుకుంటే మంచిదని పోలీసులు అంటున్నారు.
- ఇంట్లోని సీసీకెమెరా ఫుటేజీని ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని కోరుతున్నారు.
- బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు బ్యాంకు లాకర్లలో ఉంచుకోవడం సురక్షితమని చెబుతున్నారు.
- ఇంటి మెయిన్ గేటుకు తాళం వేసినా కనిపించకుండా పరదాలు అడ్డుగా ఉంచడం బెస్ట్ అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
- ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి.. గమనించాలని ఇరుగుపొరుగు వారికి చెప్పి వెళ్లాలని అంటున్నారు.
- కార్లు, బైక్ లను ఇంటి కాంపౌండ్ లోనే పార్కింగ్ చేసుకొని, చక్రాలకు గొలుసులతో తాళం వేయడం సేఫ్ అని తెలిపారు.
- అపార్ట్‌మెంట్ల దగ్గర నమ్మకమైన వాచ్‌మెన్‌లనే ఉంచుకోవాలని కోరుతున్నారు.