KCR – Madan Mohan : కేసీఆర్‌పై ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్కడు.. ఎవరో తెలుసా ?

KCR - Madan Mohan : బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు.. రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత.

Published By: HashtagU Telugu Desk
Kcr Madan Mohan

Kcr Madan Mohan

KCR – Madan Mohan : బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు.. రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత. ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలుపు ఖాయం అని చెబుతుంటారు. అయితే గతంలోకి వెళితే.. ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమి సహజం, సర్వసాధారణం.  రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం.  1983లో సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేయగా.. ఆయనపై కాంగ్రెస్ తరఫున అనంతుల మదన్ మోహన్ బరిలోకి దిగారు. నాటి ఎన్నికల్లో కేసీఆర్‌పై మదన్‌ మోహన్‌ 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే మదన్ మోహన్  సిద్దిపేటలో గెలవడం అదే తొలిసారి కాదు. అంతకుముందు 1970 ఉప ఎన్నికలో, 1972, 1978 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిద్దిపేట నుంచి మదన్ మోహన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంపై దాదాపు 13 ఏళ్లుగా ఉన్న బలమైన పట్టు వల్ల సిద్దిపేటలో మదన్‌ మోహన్‌ విజయం ఆనాడు సాధ్యమైంది.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్థాయికి మదన్ మోహన్.. 

1972 నుంచి పీవీ నరసింహారావు , మర్రి చెన్నా రెడ్డి , భవనం వెంకటరామి రెడ్డి , టంగుటూరి అంజయ్య , కోట్ల విజయ భాస్కర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా మదన్ మోహన్ పనిచేశారు. 10 సంవత్సరాల పొలిటికల్  కెరీర్‌లో రెవెన్యూ, ఆరోగ్యం, గనులు, భూగర్భ, న్యాయ, వాణిజ్య పన్నులు, సాంకేతిక విద్యాశాఖలకు మంత్రిగా ఆయన వ్యవహరించారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హైదరాబాద్‌లో జేఎన్టీయూను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు . 1983 ఎన్నికల తర్వాత ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించినప్పుడు.. మదన్ మోహన్ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..  తనను ఓడించిన మదన్ మోహన్‌ను కేసీఆర్ 1989, 1994లలో వరుసగా అసెంబ్లీ పోల్స్ లో ఓడించారు. మదన్ మోహన్ 2004 నవంబర్ 1న కన్నుమూశారు. 2008లో కొండపాక గ్రామంలో మదన్ మోహన్ విగ్రహాన్ని  అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతుల మదన్ మోహన్ 1932 నవంబర్ 16న ఆనాటి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మైలారంలో ఉన్న తన అమ్మమ్మఇంట్లో జన్మించారు. మదన్ మోహన్ తండ్రి చక్రపాణి నిజాం కాలంలో కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేసేవారు. కొండపాకలో ప్రాథమిక విద్యాభ్యాసాన్నిపూర్తి చేసిన మదన్ మోహన్.. వరంగల్ లో మెట్రిక్యూలేషన్ వరకు చదువుకున్నారు. హైదరాబాదులోని నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్సులు చేశారు.  1955 నుంచి 1969 మధ్య టైంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతోంది. ఆ టైంలో జనగామ, వరంగల్ కోర్టులతో పాటు హైకోర్టులో న్యాయవాదిగా మదన్ మోహన్ (KCR – Madan Mohan) ప్రాక్టీసు చేసేవారు.

Also Read: BJP First List: బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. 52 మంది అభ్యర్థులు వీరే..

  Last Updated: 22 Oct 2023, 02:09 PM IST