Planetary Parade : ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోల దృశ్యం ఆవిష్కృతమైంది. సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంగారక, బృహస్పతి, యూరేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. ఇది ఓ అందమైన “ప్లానెట్ పరేడ్”గా కన్పించింది. ఈ ప్లానెట్ పరేడ్‌లో ఒకే వరుసలోకి వచ్చిన శని, బృహస్పతి, అంగారక, శుక్రుడు గ్రహాలు ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా కనిపించాయి.
21 జనవరి 2025 నుంచి ఒకే వరుసలో గ్రహాల అమరికి దృశ్యం భారత్‌లో కనిపిస్తుంది. ఈ ప్లానెట్ పరేడ్ దాదాపుగా నాలుగు వారాల పాటు ఆకాశంలో కనువిందు చేస్తుంది. దీంతో నింగిలో జరిగే అద్భుతాలను వీక్షించేందుకు తగిన సమయం లభిస్తుంది. ఈ గ్రహాలను ఎలాంటి పరికరాలు వినియోగించకుండా నేరుగా కళ్లతో చూడొచ్చా అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. శుక్రుడు (Venus), అంగారకుడు (Mars),బృహస్పతి (Jupiter),శని (Saturn) గ్రహాలను నేరుగా కళ్లతో వీక్షించొచ్చు. అయితే నెప్ట్యూన్, యూరేనస్ గ్రహాలను చూడాలంటే టెలిస్కోప్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.
నాలుగు వారాల పాటు రోజూ చీకటి పడిన తర్వాత రాత్రి 8:30 గంటల ప్రాంతంలో నైరుతి దిక్కున శుక్రుడు, శని గ్రహాలను రెండు గంటల పాటు చూడొచ్చని, బృహస్పతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుం. తూర్పున అంగారక గ్రహం కనిపిస్తుందని నాసా తెలిపింది. భారత్‌లో ప్రతి నగరం నుంచి ఈ గ్రహాల కవాతును చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి దృశ్యం ఫిబ్రవరి 28వ తేదీన మరోసారి సాక్షాత్కారం కానుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆకాశంలో ఆరు నుంచి ఏడు గ్రహాలు ఒకే వరుసలో రావడం చాలా అరుదుగా జరిగే సంఘటన.
అయితే ఇవి స్పష్టంగా కనిపించడం అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. స్థానిక వాతావరణం, ఆ ప్రాంతంలో కాలుష్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ సుందర దృశ్యం స్పష్టంగా కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే కాంతి,కాలుష్యం తక్కువ స్థాయిలో ఉండే ప్రదేశాల్లో ఈ గ్రహాల అమరిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కాలుష్యం అతితక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల నుంచి వీక్షిస్తే ఈ ఖగోళ అద్భుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
Read Also: AI Cancer Vaccine : ఏఐతో 48 గంటల్లోనే క్యాన్సర్ వ్యాక్సిన్.. ఎలాగో చెప్పేసిన ఒరాకిల్ ఛైర్మన్