Instagram reels చేయడం ఒకటైతే గంటలతరబడి రోజుల తరబడి వాటిని చూస్తూ అలాగే ఒకదానితరువాత మరొకటి స్క్రోల్ చేస్తూ కూర్చోవడం మరొకటి. Instgram మన జీవితంలోకి ప్రతీ అంశంలోకి చొచ్చుకుని వస్తోంది. ఫేస్బుక్ లో కూడా ఇన్స్టా రీల్స్ కనిపించడం ఫేస్బుక్ కి ఇన్స్టా కనెక్ట్ ఐవుండటం కూడా ఇందుకు నిదర్శనం. ఈ మధ్య చాలామంది ఈ రీల్స్ ని స్ర్కోల్ చేస్తూ కూర్చోవడం గమనిస్తుంటాను హాస్పిటల్ లో పేషంట్ లాంజ్ లో కూర్చుని చేతిలో సెల్ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ గడిపేవారు కోకొల్లలు. వాళ్ళ తల్లికో తండ్రికో బిడ్డకో భార్యకో భర్తకో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఐసియూలో ఉన్నా ఎవరికేమైనా కాకున్నా..ఇన్స్టా రీల్స్ ని అలా స్క్రోల్ చేస్తూ చూస్తూ గడపడం కనిపిస్తూ ఉంటుంది.
ప్రపంచంలో ఉన్న రియాలిటీనుండి తప్పించుకుని సెల్ఫోన్ స్క్రీన్ కి కళ్ళు అప్పగించి మరెవరో చేసిన కొన్ని సెకన్ల రీల్సును ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ కూర్చోవడం ఈ మధ్య చూస్తున్న ఎస్కెప్ మెఖానిజం. సోషల్ మీడియా డిజైనర్స్ ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ రూపంలో అతి తక్కువ నిడివిగల వీడియోలను డిజైన్ చేయడంలో సైన్సు ఉంది. ఈ అతి తక్కువ నిడివి రీల్ వీడియో ఐపోగానే బ్రెయిన్ లో డోపమైన్ రిలిజ్ అవుతుంది. అలా ఎన్ని వీడియొలు చూస్తే అన్ని సార్లు డోపమైన్ రిలిజ్ అవుతుంది. ఫోటోలకంటే వీడియోలు , మ్యూజిక్ , డాన్సులు, మనలోని సెన్స్ ఆర్గాన్స్ ని ప్రోద్బలం చేసేవిలా ఉండటం, వాటితో పాటు అందమైన ముఖాలు శరీరాకృతి కనబడేలా ఫిల్టర్లు ఉండటంతో instant dopamine release with sensory organ gratification వంటిదొకటి మొదలై అది అలవాటుగా అడిక్షన్ గా మారుతుంది.
ఒకటి గమనించండి..ఇలా ఇన్స్టా రీల్స్ ని గంటల తరబడి రోజుల తరబడి చూడటం వలన వచ్చే ప్రయోజనం నిజానికి ఏమైనా ఉన్నదా. సరే ఒక జోక్ చూశాం. మరో జోక్ చూశాం..మరోటి ..మరోటి. ఎన్ని చూసినా అదంతా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇలా ఎన్ని సంవత్సరాలు చూసినా వచ్చేదేమీ లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా చుట్టూ ఉన్న ప్రపంచం కేవలం మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఉందా?. లేక మనం జీవించేది కేవలం మనల్ని మనం ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం కోసమేనా? ఏ పని చేసినా ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ అవకూడదు అనే ధోరణినా?. ఎందుకు ఇంతలా అడిక్షన్ పెరిగుతోంది?. దీని పర్యావసానాలు ఏమిటి?.
ముఖ్యంగా యువతలో ఇది అడిక్షన్ గా మారడంతో బ్రెయిన్ లో కేవలం సెన్సరీ న్యూరోనల్ సర్క్యూట్ లే అభివృద్ధి చెందుతాయి. పుస్తక పఠనం అనేది క్రిటికల్ థింకింగ్ ని అభివృద్ధి చేస్తుంది. మెదడులోని అన్ని భాగాలు క్రిటికల్ థింకింగ్ వలన ఉత్తేజితమౌతాయి. ఈ రీల్స్ సెలబ్రిటీ కల్చర్ మనిషి మెదడులో ని చాలా భాగాలు atrophy కి గురయ్యేలా చేస్తాయి. అంటే ఆ మెదడు భాగాలు ఉపయోగమే లేకపోవడంతో అవి చచ్చుబడి ముడుచుకుపోతాయి. ఈ అడిక్షన్ యువతలోనే కాకుండా స్కూలు పిల్లల్లో కూడా. ఇంకా స్కూల్ పిల్లలతో ఏకపాత్రాభినయమో నృత్యమో కాక ఇన్స్టా రీల్స్ చేయించడం కూడా చూస్తాం. ఎవరు ఎవరిని నాశనం చేస్తున్నారో ఎవరికి వారు గమనించుకోవాలి.
దీనికి పరిష్కారం చాలా సింపుల్.
వేలి చివరతో ఇన్స్టా యాప్ ని అన్ ఇన్స్టాల్ చేయడమే. ఆ తర్వాత రోజూ పుస్తకాలు చదవడం పై ధ్యాస పెంచుకోవడం చేయవచ్చు. ఇతర హాబీలను అలవరచుకోవడంపై దృష్టి పెట్టవచ్చు.
జీవితం ఊరికే రాదు.
– By Dr విరించి విరివింటి