Youtuber Success Story: ఉద్యోగం వదిలి.. అక్షర సేద్యానికి కదిలి!

‘‘ఒక్క‌సారి ఈ మ‌ట్టిలోకి అడుగు పెడితే.. ఆ త‌ర్వాత భూదేవి త‌ల్లే లాగేసుకుంటుంది’’.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ‘మ‌హ‌ర్షి’ సినిమాలోని డైలాగ్ ఇది.

  • Written By:
  • Updated On - March 12, 2022 / 10:55 PM IST

‘‘ఒక్క‌సారి ఈ మ‌ట్టిలోకి అడుగు పెడితే.. ఆ త‌ర్వాత భూదేవి త‌ల్లే లాగేసుకుంటుంది’’.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ‘మ‌హ‌ర్షి’ సినిమాలోని డైలాగ్ ఇది. ఈ డైలాగ్ న‌ల్ల‌గొండ జిల్లా వ్యవసాయ జర్నలిస్ట్ జూల‌కంటి రాజేంద‌ర్ రెడ్డికి అతికిన‌ట్టుగా స‌రిపోతోంది. ఎవ్వ‌రూ క‌ల‌గ‌న‌లేదు.. చిన్న‌ప్పుడు పొలం గట్ల మీద‌ ఆడుకునే కుర్రాడే పెరిగి పెద్ద‌వాడై రైతుబ‌డి పాఠాలు చెప్తాడ‌ని, ఏ ఒక్క‌రూ ఊహించ‌లేదు అక్ష‌రాల‌ను వ‌దిలి వ్య‌వ‌సాయంలో అద్భుతాలు సృష్టిస్తాడ‌ని.. రైతు సంక్షేమ‌మే ధ్యేయంగా ‘తెలుగు రైతుబ‌డి’ అనే యూట్యూబ్ చాన‌ల్ ను  ప్రారంభించి, ఎంతోమంది అన్న‌దాత‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడీయ‌న‌. అస‌లు రాజేంద‌ర్ రెడ్డి ‘తెలుగు రైతుబ‌డి’ని ఎందుకు ప్రారంభించాడు? ఐదెంక‌ల జీతం వ‌దులుకొని పొలంబాట ఎందుకు ప‌ట్టాల్సి వ‌చ్చింది? లాంటి విష‌యాల‌ను హ్య‌ష్‌ట్యాగ్ యూ (Hashtagu)తో షేర్ చేసుకున్నారు.

పంట పొలాల మధ్యన..

జూల‌కంటి రాజేంద‌ర్ ది న‌ల్ల‌గొండ జిల్లాకు సమీపంలోని మాచనపల్లి గ్రామం. తండ్రి మోహ‌న్ రెడ్డి చిన్న‌పాటి రైతు. త‌ల్లి వ్య‌వ‌సాయ ప‌నుల్లో చేదోడువాదోడుగా ఉండేది. రాజేంద‌ర్ రెడ్డి కుటంబ‌మంతా వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి జీవించేవాళ్లు కావ‌డంతో తెలియ‌కుండానే సాగు కు ద‌గ్గ‌ర‌య్యాడు. తండ్రి పొలం ప‌నుల్లో నిమ‌గ్న‌మైతే.. పొలం గ‌ట్టుపై సైకిల్ తొక్కుతూ మ‌ట్టి ప‌రిమ‌ళాల‌ను ఆస్వాదించేవాడు. ఆ త‌ర్వాత వ్య‌వ‌సాయంపై ఇష్టం పెంచుకొని తండ్రికి సాయం చేస్తుండేవాడు. ప‌లుగు పార ప‌ట్ట‌క‌పోయినా ప‌శువుల‌ను మేప‌డం, పంట‌ల‌కు నీళ్లు పారించ‌డం చేసేవాడు. అయితే ఇంట్లోవాళ్ల సూచ‌న మేర‌కు రాజేంద‌ర్ రెడ్డి ఒక‌వైపు చ‌దువుతూనే, మ‌రోవైపు వ్య‌వ‌సాయ ప‌నులు చేసేవాడు. పీజీ జ‌ర్న‌లిజం చేయ‌డంతో తెలియ‌కుండా మీడియాలోకి అడుగు పెట్టాల్సి వ‌చ్చింది. అక్ష‌రాల‌పై ప‌ట్టు, జ‌ర్న‌లిజం ఆస‌క్తితో జిల్లా స్టాప‌ర్‌, బ్యూరోగానూ  బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 21 ఏళ్ల‌కే  (ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ రంగాల్లో) బాధ్య‌త‌యుత‌మైన ప‌నులు నిర్వ‌ర్తించాడు. ఏ సంస్థ‌లో ప‌నిచేసినా త‌న బెస్ట్  ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నించేవాడు.

అనుకోకుండా ఒక‌రోజు

‘ఏ ప‌నిచేసినా మ‌న‌సుకు న‌చ్చిన ప‌నిచేస్తే ఆ త్రుప్తి వేరుగా ఉంటుంది’ అనేది రాజేంద‌ర్ రెడ్డి సిద్ధాంతం. అందుకే ఈ యువ‌రైతు మ‌న‌సుకు న‌చ్చిన ప‌నినే చేయాల‌నుకున్నాడు. అయితే ఆ ప‌ని త‌నకే కాకుండా స‌మాజానికీ ఉప‌యోగ‌ప‌డాల‌ని సంక‌ల్పించాడు. త‌న‌కొచ్చిన ఆలోచ‌న‌ను వెంట‌నే ఆచ‌ర‌ణ‌లోపెట్టేశాడు. అస‌లే క‌రోనా మ‌హామ్మారి.. ఆపై లాక్ డౌన్ .. అలాంటి పరిస్థితుల్లో ఎవ‌రైనా ఉద్యోగానికి రాజీనామా చేయ‌డ‌మంటే క‌త్తి మీద సాము లాంటిదే. కానీ భ‌య‌ప‌డితే, ప‌రిస్థితుల‌కు త‌ల‌వంచితే.. త‌న ల‌క్ష్యం నీరుగారిపోతుంద‌ని భావించాడు. పాండ‌మిక్ స‌మ‌యంలోనూ స‌రికొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్టాడు. ఒకవైపు జర్నలిస్ట్ కొనసాగుతూనే, మరోవైపు రైతు బ‌జార్‌, ఆర్గానిక్ ప్రొడ‌క్స్ లాంటివి ప్రారంభించాడు. అవన్నీ ఎలాంటి ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోయినా, త‌న ల‌క్ష్యాన్ని మాత్రం విడిచిపెట్ట‌లేదు. అయితే రాజేంద‌ర్ కు  డిజిట‌ల్ మీడియా పై కొంత ప‌ట్టు ఉండ‌టంతో ‘తెలుగు రైతుబ‌డి’ అనే యూట్యూబ్ చాన‌ల్ ర‌న్ చేశాడు. ఈ చాన‌ల్ ద్వారా రైతులు పండిస్తున్న పంట‌లు, సాగు విధానం, స‌స్య‌ర‌క్ష‌ణ ప‌ద్ద‌తుల‌ను విపులంగా, వివ‌రంగా వీడియోల రూపంలో క‌ళ్ల‌కు క‌ట్టాడు. అంటే ఒక స‌మాచారం రైతు నుంచి నేరుగా రైతుకే చేరేలా వీడియోల‌ను షూట్ చేసి సక్సెస్ అయ్యాడు. ఫ‌లితంగా కొద్దిరోజుల్లోనూ రైతుబ‌డికి మంచి పేరొచ్చింది. గూగుల్ నుంచి ‘సిల్వ‌ర్ క్రియేట‌ర్’ అవార్డు వ‌రించింది. రాజేంద‌ర్ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కింది.

రైతుబ‌డికి రా

వ్య‌వ‌సాయ మెళ‌కువ‌ల‌ను అందించేందుకే ఎన్నో చాన‌ళ్లు ఉన్న‌ప్ప‌టికీ, రాజేంద‌ర్ రెడ్డి చాన‌ల్ మాత్రం చాలామంది రైతుల‌కు చేరింది. అరుదైన పంట‌లు, ప‌ద్ధ‌తుల‌ను ప‌రిచ‌యం చేయ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన షేక్ బాషా మెట్ట వరి సాగును వేలాది రైతుల‌కు ప‌రిచ‌యం చేయ‌డంతో.. ప్ర‌స్తుతం ఆ ప‌ద్ధ‌తిలో ల‌క్ష ఎక‌రాలు సాగ‌వుతున్నాయి. ఇలాంటి అద్భుత‌మైన‌, అరుదైన కార్య‌క్ర‌మాలు చేస్తుండటం వ‌ల్లే 3.7 లక్షల సబ్ స్క్రైబర్లతో రైతుబ‌డి స‌క్సెస్ పుల్ గా ర‌న్ అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 332  వ్య‌వ‌సాయ వీడియోలున్న‌ ఆ చాన‌ల్ కు 5 కోట్ల వ్యూయ‌ర్ పిష్ ఉంది. ల‌క్ష్యం కోసం వంద‌సార్లు ప్ర‌య‌త్నించినా.. అది నెర‌వేర‌క‌పోతే మ‌రో ప్ర‌య‌త్నం చేయాలంటారు పెద్దలు. రాజేంద‌ర్ రెడ్డి అలాంటి ప్ర‌య‌త్నమే చేశాడు కాబ‌ట్టే నేడు తన క‌ల‌ల‌ను సాకారం చేసుకున్నాడు.

కొత్త పద్ధతులను పరిచేయం చేయాలనుంది- రాజేంద‌ర్ రెడ్డి

ఇప్ప‌టివ‌ర‌కు ‘తెలుగు రైతుబ‌డి’ చాన‌ల్ తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఈ చాన‌ల్ కు త‌మిళ‌నాడు,  క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు విస్త‌రించాల‌నుకుంటున్నా. ఆయా రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారంద‌రికీ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను అందించ‌డ‌మే నా ల‌క్ష్యం. వాళ్ల‌కోసం మాస‌ప‌త్రిక సైతం తెచ్చేందుకు పాటుప‌డుతున్నా. అందుకోసం ఎంత‌కైనా క‌ష్ట‌ప‌డ‌తా. ఎన్ని ఊళ్ల‌యినా తిరుగుతా!