Site icon HashtagU Telugu

Yadlapati: అందర్నీ ప్రేమించు.. కొందర్నే నమ్ము..!

Yadlapati

Yadlapati

వ్యవసాయ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన యడ్లపాటి వెంకట్రావు అనేక పదవులను సమర్థవంతంగా నిర్వర్తించి చెరగని ముద్ర వేశారు. న్యాయశాస్త్రం అభ్యసించిన వీరు రాజకీయాల్లోనూ రాణించారు. ఆచార్య ఎన్జీ రంగా శిష్యరికంలో ఎదిగిన వీరు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దాయనగా గుర్తింపు పొందారు. వయోభారంతో ఆయన అస్తమించినా… అన్నదాతలకు ఆప్తుడిగా.. నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. యడ్లపాటి వెంకటసుబ్బయ్య, రాఘవమ్మ దంపతులకు 1919 డిసెంబరు16న వెంకట్రావు జన్మించారు. వీరి స్వస్థలం అమృతలూరు మండలం బోడపాడు. తురుమెళ్ల ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్ సీ చదివిన యడ్లపాటి వెంకట్రావు తర్వాత గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ, మద్రాసులో ఎల్ఎల్ బీ చేసిన వీరు 1945లో తెనాలిలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అలా 1973 వరకు న్యాయవాద వృత్తిలో కొనసాగారు.

వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యడ్లపాటి వెంకట్రావు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ‘అందర్నీ ప్రేమించు.. కొందర్నే నమ్ము.. నీ పని నువ్వు చేసుకుంటూ పో’ అనే విధానాన్ని పాటించిన వీరు ఏనాడు పదవులను ఆశించలేదు. అయినా తనకు అందివచ్చిన పదవులకు వన్నె తెచ్చేలా అంకితభావంతో పనిచేశారు. ఆచార్య ఎన్జీ రంగా స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగిడిన యడ్లపాటి ఆయన శిష్యరికంలో రాటుదేలారు. ఎన్జీ రంగా అంటే వీరికి ఎనలేని గౌరవం. అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవులు నిర్వర్తించిన యడ్లపాటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సంగం డెయిరీ వ్యవస్థాపక చైర్మన్ గా, జంపని షుగర్స్ చైర్మన్ గా , శాసనసభ్యుడిగా, వ్యవసాయ, న్యాయశాఖ మంత్రిగా, కర్షక్ పరిషత్ ఇన్ చార్జిగా, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడిగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ఏసీఐడీసీ చైర్మన్ గా బహుముఖ సేవలందించారు యడ్లపాటి.

2004 ఎన్నికల వరకు జనరల్ స్థానంగా వున్న వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యడ్లపాటి పలుమార్ల పోటీ చేశారు. 1962, 1965(ఉపఎన్నిక)లో స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన ఈయన 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర గెలుపొందారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) తరపున పోటీచేసి విజయం సాధించిన ఆయన 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున, 1989లో టీడీపీ తరఫున పోటీచేసి పరాజితులయ్యారు. ఆ తర్వాత 1994 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న యడ్లపాటి జిల్లాలో టీడీపీ గెలుపులో కీలకపాత్ర పోషించారు. తదుపరి 1995లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించగా, యడ్లపాటి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు యడ్లపాటిని రాజ్యసభ సభ్యుడిగా పెద్దల సభకు పంపారు. రైతువాణిని ఢిల్లీ వరకు వినిపించిన పెద్దాయన లేని లోటు పూడ్చలేనిది.

Story by: అవ్వారు శ్రీనివాసరావు