Hanuman Jayanti: హనుమంతుడ్ని పూజిస్తే అన్ని విజయాలే!

ఆంజనేయుని బలం అనంతం. శక్తికి, ధైర్యానికి మారుపేరు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలూ, సమస్యలూ సమసిపోతాయి.

  • Written By:
  • Updated On - April 16, 2022 / 02:00 PM IST

ఆంజనేయుని బలం అనంతం. శక్తికి, ధైర్యానికి మారుపేరు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలూ, సమస్యలూ సమసిపోతాయి. ఆంజనేయుని నమ్ముకుంటే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలకు లోనైనప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. కొన్ని ఆలయాలలో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతునిని వీరాంజనేయుడు, యోగాంజనేయుడు, భక్తాన్జనేయుడు, ధ్యానాంజనేయుడు, దాసాంజనేయుడు అనే నామాలతో స్వామివారు భక్తులచే పూజలు, అభిషేకాలు అందుకుంటుంటాడు. హనుమంతునికి సింధూర అభిషేకం అంటే చాలా ఇష్టం.

ఆకు పూజ అంటే కూడా చాలా హనుమంతునికి ఎంతో ప్రీతి. ఇంకా చెప్పాలంటే తీపి అప్పాలు, వడలు అంటే చాలా చాలా ఇష్టం. హనుమంతుని దర్శనం చేసుకున్న తరువాత స్వామివారిని 11 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఆ తరువాత స్వామివారికి సింధూరాభిషేకం, ఆకు పూజలు చేయించి నైవేద్యంగా అప్పాలు, వడలు సమర్పించాలి. ఇలా హనుమంతునికి పూజలు చేయడం వలన స్వామివారు ప్రీతి చెందుతారు. హనుమస్వామి అనుగ్రహం వలన భయాలు, బాధలు అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోయి జీవితంలో ఆనందకరమైన సిరిసంపదలతో ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలలో స్పష్టం చేయబడుతోంది.

చైత్ర శుక్ల పూర్ణిమ నాడు మాత్రమే గాకుండా ఆంజనేయ స్వామిని శనివారం, మంగళవారం ఇంకా గురువారాల్లో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే హనుమాన్ జయంతికి ప్రత్యేకత ఉంటుంది. ఇక హనుమాన్ యాత్ర అనగానే రాజకీయ పార్టీలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున కదిలి వస్తుంది. వివిధ పార్టీల జెండాలు అన్ని తమ తమ ఇంట్లోనే ఉంచి, హనుమాన్ జయంతి ర్యాలీలో మాత్రం కాషాయ జెండాలు ప్రదర్శించడం హిందూ ఐక్యతకు  చిహ్నం. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ,  వైఎస్సార్ టీపీ, ఆప్ ఇలా అన్ని ప్రముఖ పార్టీల నాయకులకు బజరంగ్ దళ్ ఆహ్వానం అందజేసింది. దాదాపు లక్ష 26 వేల బైకులు, 6 వేల ఫోర్ వీలర్ లు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొంటాయని అంచనా.