Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra: 38 ఏళ్ల క్రితమే కశ్మీర్ టు కన్యాకుమారి.. ‘భారత్ జోడో’ వివరాలివే!

Bharath Jodo yatra

Bharath Jodo

రాజకీయాల్లో (Politics) పాదయాత్రలు, ప్రచార యాత్రలు పవర్ ఫుల్ టూల్స్. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నుంచి ఎల్‌కె అద్వానీ వరకు చాలామంది నాయకులు ప్రజలతో మమేకం కావడానికి రాజకీయ పర్యటనలు చేపట్టారు. తాజాగా  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా భారత్‌ జోడో యాత్ర  (Bharat Jodo Yatra) పేరుతో పొలిటికల్ టూర్ ప్రారంభించారు. ఇటీవల కాలంలో దీనిపై వాడీవేడి చర్చ జరుగుతోంది. 2022  సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ గాంధీ యాత్ర అనేక రాష్ట్రాల మీదుగా సాగుతోంది. ఈ యాత్ర జనవరి 30న కాశ్మీర్‌లో ముగుస్తుంది.  150 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో 3,570 కిలోమీటర్ల దూరం రాహుల్ ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు.

38 సంవత్సరాల క్రితం..

38 సంవత్సరాల క్రితం కూడా దేశంలో ‘భారత్ జోడో యాత్ర’  (Bharat Jodo Yatra) నిర్వహించబడిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ప్రయాణం దేశంలోని దక్షిణం నుంచి ఉత్తరం ..తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు సాగింది. దీని ఉద్దేశ్యం కూడా ప్రత్యేకమైనది. అయితే ఆ యాత్ర నాయకుడు కూడా ఒక ప్రత్యేక వ్యక్తి. ఆయనే గాంధేయ సామాజిక కార్యకర్త బాబా ఆమ్టే.  1984లో స్వర్ణ దేవాలయంలో మిలిటరీ ఆపరేషన్ (ఆపరేషన్ బ్లూ స్టార్) తర్వాత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు ఏర్పడింది. ఎక్కడికక్కడ ఘర్షణ, హింసాత్మక వాతావరణం నెలకొంది. అదే సంవత్సరం, ఇందిరా గాంధీ హత్య తర్వాత, చాలా చోట్ల హింస జరిగింది. ఢిల్లీలో సిక్కులపై హింస తర్వాత చుట్టూ ఉద్రిక్తత అలుముకుంది. అటువంటి పరిస్థితుల్లో సామరస్యం , జాతీయ సమైక్యత కోసం బాబా ఆమ్టే యాత్ర ప్రారంభించారు.  బాబా ఆమ్టే 1984లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు.. 1988లో అరుణాచల్ నుండి గుజరాత్ వరకు యాత్ర జరిపారు.

బాబా ఆమ్టే (Baba Amte) ప్రయాణంపై తన పుస్తకంలో తారా ధర్మాధికారి వివరించారు. విశేషమేమిటంటే.. ఈ ప్రయాణంలో పాల్గొన్న మొత్తం 125 మంది వ్యక్తుల వయస్సు 35 సంవత్సరాల కంటే తక్కువ. వారిని YES లేదా యూత్ ఎమర్జెన్సీ సర్వీస్ అని పిలిచేవారు.70 ఏళ్ల వయస్సులో ఆరోగ్యం బాగాలేకపోయినా బాబా ఆమ్టే యాత్ర చేశారు. ఆయన నేతృత్వంలో 125 మంది యువకుల బృందం సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, సమావేశాలు చేసింది.ఈ భారత్ జోడో యాత్రలో 22 రాష్ట్రాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. ఈ యాత్రలో ముగ్గురు వికలాంగ యువకులు కూడా పాల్గొన్నారు. సూర్యవంశీ అనే యువకుడికి ఒక కాలు మాత్రమే ఉంది. అయినప్పటికీ అతను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మరియు ఇటానగర్ నుండి ఓఖా వరకు పద్నాలుగు వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి చివరి వరకు ఈ ప్రయాణంలో స్థిరంగా ఉన్నాడు. రాజస్థాన్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తికి కాలులో సమస్య ఉంది. అయినా యాత్రలో పాల్గొన్నాడు. ముస్తఫా కొత్వాల్ పోలియో కారణంగా అంగవైకల్యానికి గురయ్యాడు. అయినప్పటికీ పట్టుదలతో యాత్రలో పాల్గొన్నాడు.

ఏయే రాష్ట్రాల్లో..

ఆనాటి భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సహా 14 రాష్ట్రాల గుండా సాగింది. యాత్ర మొదటి దశలో.. బాబా ఆమ్టే సహచరులు కన్యాకుమారి నుంచి 110 రోజులలో పద్నాలుగు రాష్ట్రాలను దాటి 5042 కి.మీల దూరం ప్రయాణించి కాశ్మీర్ కు చేరుకున్నారు.భాష, మతం, కులం అనే అడ్డంకులను దాటుకుని కలిసి జీవించడమే ఈ యాత్ర ఉద్దేశం.

మొదటి దశ టూర్..

భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు.. ఇటానగర్ నుంచి ఓఖా వరకు రెండు భాగాలుగా నిర్వహించారు. మొదటి దశలో (First faze).. ఈ యాత్ర 1984 డిసెంబర్ 24న ప్రారంభమైంది. పద్నాలుగు రాష్ట్రాల్లో ఐదు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన ఈ బృందం 1985 ఏప్రిల్ 12న 110 రోజుల్లో జమ్మూకు చేరుకుంది.

రెండో దశ టూర్..

దేశంలోని (India) తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతాన్ని కవర్ చేసింది. తారా ధర్మాధికారి పుస్తకం ఈ ప్రయాణాన్ని సమగ్రంగా వివరిస్తుంది. దీని ప్రకారం.. “రెండవ దశ యాత్ర 1988 నవంబర్ 1 నుంచి 1989 మార్చి 26 వరకు నిర్వహించబడింది.  తూర్పు వైపు అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుండి బయలుదేరి, పశ్చిమ వైపున ఓఖా ఓడరేవు చివరి స్టాప్‌గా ఉంచబడింది.మొత్తం ఎనిమిది వేల కిలోమీటర్లకు పైగా దూరాన్ని 146 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. వాటిలో, 128 రోజులు సైకిల్‌పై ప్రయాణించాలి. 18 రోజులు విశ్రాంతి తీసుకోవాలి” అని రెండో దశ యాత్ర గురించి వివరించారు.

Also Read: Veerasimha Reddy: జగన్ కు ‘వీరసింహారెడ్డి’ సెగ.. బాలయ్య డైలాగ్స్ వైరల్!