Mumbai Terror Attack: సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజున (2008 నవంబర్ 26న) మన దేశ వాణిజ్య రాజధాని ముంబైపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. దాన్నే మనం 26/11 ఉగ్రదాడిగా చెప్పుకుంటున్నాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారు. పాకిస్తాన్ సముద్ర జలాలకు సమీపంలో ఓ భారతీయ పడవను ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ పడవ ద్వారానే 10మంది లష్కరే తైబా ఉగ్రవాదులు కొలాబా సముద్ర మార్గం ద్వారా ముంబై నగరంలోకి చొరబడ్డారు. అక్కడి నుంచి వేర్వేరు టీమ్‌లుగా విడిపోయిన ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు.
Also Read :Ram Gopal Varma : ఆర్జీవీకి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
స్టార్ హోటళ్లు, హాస్పిటళ్లు, రైల్వేస్టేషన్లలో ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు.ఏకే-47 తుపాకులతో విచక్షణారహితంగా ఫైరింగ్ చేశారు. నగరంలోని(Mumbai Terror Attack) తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ లైట్ హౌస్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 12 చోట్ల బాంబులు, తుపాకులతో విధ్వంసానికి తెగబడ్డారు. ఈ దాడుల్లో 166 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఉగ్రవాదులతో పోరాడుతూ మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే అమరుడయ్యారు.
ముంబైలోని ఒక్క రైల్వేస్టేషన్‌లో జరిగిన దాడిలోనే 58 మంది చనిపోయారు. ఉగ్రవాదుల కోసం 60 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి 10మందిలో 9మందిని భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఒక్క అజ్మల్ కసబ్‌ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష విధించింది. ఉగ్రదాడికి పాల్పడిన నాలుగేళ్ల తర్వాత 2012 నవంబర్‌లో అతడిని ఎరవాడ జైలులో ఉరి తీశారు. ఆనాడు ఉగ్రవాదులు ముంబైలో క్రియేట్ చేసిన రక్తపాతాన్ని నేటికీ భారతీయులు గుర్తు చేసుకుంటున్నారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలపై చర్యలను కోరుకుంటున్నారు.