ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్‌లో అస్వస్థతకు గురి అయ్యారు. పార్లమెంటులో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో, అప్రమత్తమైన సిబ్బంది పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, పిల్లి సుభాష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి.
పిల్లి సుభాష్ చంద్రబోస్ పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని తెలుస్తోంది. ఇటీవల పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం కారణంగా, ఇలా జరిగి ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహా, ఇతర కీలక నేతలంతా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం పై ఆరా తీశారు. అలాగే వైసీపీ కీలక ఎంపీలంతా ఆయన చేరిన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని అక్కడి వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పార్లమెంట్‌లో వాడీ వేడిగా సభ జరుగుతున్న సమయంలో ఆయన అలా అకస్మాత్తుగా పడిపోవడంతో, అక్కడ ఉన్నవారంతా కంగారు పడాల్సి వచ్చింది.