Site icon HashtagU Telugu

Yediyurappa and son: యడ్డీ.. వాట్ నెక్ట్స్!

Yaddi

Yaddi

ఒక పెద్ద విజయం వంద తప్పులను కప్పిపుచ్చేస్తుంది అంటారు. మామూలుగా అయితే క్రికెట్ లో ఎక్కువగా ఇలాంటి మాటలను వాడుతుంటారు. కానీ ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో కూడా ఇలాంటిదే వినిపిస్తోంది. ఎందుకంటే యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడే… వయసురీత్యా, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా సీఎం పదవి నుంచి పక్కకు తప్పుకోమని అదిష్టానం ఆదేశించింది. దీంతో ఆయన ఒక్కసారిగా షాకయ్యారు. అయినా సరే.. తన కుమారుడిని సీఎంగా చేయడానికి ప్రయత్నించారు. కానీ వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని చెబుతుంది కదా. అందుకే ఆ డిమాండ్ నెరవేరలేదు. మరి యడియూరప్ప, ఆయన కుమారుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం తరువాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీలో ఉన్న కొద్దిపాటి అసమ్మతి రాగం కూడా ఆగిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో యడియూరప్ప కుమారుడు విజయేంద్ర కూడా.. తనకు ప్రస్తుత బీజేపీ సర్కారులో ఎలాంటి మంత్రి పదవి చేపట్టాలన్న ఉద్దేశం లేదని.. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికే కృషి చేస్తానన్నారు. విజయేంద్ర ఢిల్లీ పర్యటనలో.. నిజంగానే పార్టీని బలోపేతం చేసే విషయంపైనే చర్చలు జరిగాయా? లేక కర్ణాటక బీజేపీ సర్కారులో మంత్రిపదవి కోసం లాబీయింగ్ నడిచిందా అంటే అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. కర్ణాటక సీఎం సీటులో ఎంత యడియూరప్ప నమ్మకస్తుడైన వారు ఉన్నా.. సమీకరణాలు మారిపోతుంటాయి. అందుకే పార్టీపై తన పట్టు జారకుండా యడియూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం కర్ణాటక బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న విజయేంద్ర విషయంలో పార్టీ అధిష్టానం చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే 2019 జూలై నుంచి 2021 జూలై వరకు యడియూరప్ప సీఎంగా ఉన్న కాలంలో విజయేంద్ర షాడో సీఎంగా ఉన్నారని.. సూపర్ సీఎంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చే విషయంపై ఆచి తూచి వ్యవహరిస్తోంది. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయేంద్ర.. తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తున్న శిఖరిపుర నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version