South Central Railway: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) చరిత్రలో మొట్టమొదటిసారిగా నాలుగు కీలక విభాగాలకు మహిళా అధికారులే నాయకత్వం వహిస్తున్నారు. ఈ మహిళా అధికారులు రైల్వే బోర్డు, జోనల్ స్థాయిలో తమ సంబంధిత విభాగాల విజయాలు, పనితీరును తెలియజేస్తూ ఉన్నత స్థాయి సమావేశాలలో క్రమం తప్పకుండా పాల్గొంటారు. రైలు కార్యకలాపాలను మెరుగుపరచడంలో, జోన్ మొత్తం పనితీరును మెరుగుపరచడంలో కీలకమైన సూచలను అందించడం ద్వారా భద్రత & పనితీరు సమీక్ష సమావేశాలలో కూడా వారు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్(పి.సి.సి.ఏం)గా కె. పద్మజ (ఐ.ఆర్.టి.ఎస్.1991 బ్యాచ్ ) జూలై, 2024లో బాధ్యతలు స్వీకరించారు. కమర్షియల్ డిపార్ట్‌మెంట్ అధిపతిగా, వారు వినియోగదారుల సంతృప్తి, రాబడిని నిర్ధారించే విధంగా ప్రయాణీకుల, సరుకు రవాణా సేవల సమర్థవంతమైన నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. వాణిజ్య విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె. పద్మజ వంటి ప్రయాణీకుల సేవలైన టికెటింగ్, రిజర్వేషన్లు, కస్టమర్ సహాయం, సరుకు రవాణా కార్యకలాపాలు, స్టేషన్ నిర్వహణ, ప్రకటనలు, నాన్-ఫేర్ రాబడి, మార్కెటింగ్ & వ్యాపార అభివృద్ధి, ఆదాయ ఉత్పత్తి మొదలైన వాటిని నిర్వహిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో నవంబర్, 2024 చివరి నాటికి 175 మిలియన్ల ప్రయాణీకులను తీసుకువెళ్లింది. తద్వారా రూ. 3,817 కోట్లు ప్రయాణీకుల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా (నవంబర్ వరకు) స్థూల మూలాధార ఆదాయం రూ. 13,231 కోట్లు సాదించడమైనది.
కె. పద్మజ అక్టోబర్, 2024 నుండి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఆమె రైలు కార్యకలాపాలను ప్లాన్ చేయడంలో, ప్రయాణీకుల, సరకు రవాణా రైళ్ల సురక్షితమైన, సమర్థవంతమైన, సమయపాలనను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ డిపార్ట్‌మెంట్ రైళ్ల షెడ్యూల్, టైమ్‌టేబులింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, మౌలిక సదుపాయాల కల్పన , రోలింగ్ స్టాక్ అవసరాలను తీర్చడానికి ఇతర విభాగాలతో సమన్వయం చేయడం, రైలు కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమయపాలన పనితీరు మొదలైనవాటిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) నవంబర్ వరకు జోన్ 89.76 మిలియన్ టన్నుల సరకు రవాణాతో 8,776 కోట్ల భారీ ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత సంవత్సరంలో వివిధ పండుగలు, ముఖ్యమైన సందర్భాలలో ప్రయాణికుల సౌకర్యార్థం జోన్ 2,557 ప్రత్యేక రైలు సర్వీసులను కూడా నిర్వహించింది.
దక్షిణ మధ్య రైల్వే ఇన్‌స్పెక్టర్ జనరల్- కమ్- ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ (ఐ.జి.-కమ్-పి.సి.ఎస్.సి-గా అరోమా సింగ్ ఠాకూర్ (ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. 1993 బ్యాచ్) జూలై, 2023లో బాధ్యతలు స్వీకరించారు. ఆమె రైల్వేలో రైలు ప్రయాణికులకు, రైల్వే ఆస్తుల భద్రతకు ప్రాముఖ్యతనిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆర్.పి.ఎఫ్ నేరం, నేరాల దర్యాప్తు, విపత్తు ప్రతిస్పందన, క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా & పర్యవేక్షణ, ప్రయాణీకులకు సహాయం, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో స్థానిక అధికారులతో సమన్వయం చేయడం వంటి ప్రధాన బాధ్యతలను నెరవేరుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2024 వేడుకల్లో భాగంగా అరోమా సింగ్ నాయకత్వంలోని ఆర్.పి.ఎఫ్ ‘శక్తి’ టీమ్‌కు “మహిళల రక్షణ కేటగిరీ” కింద అవార్డు ప్రధానం చేసింది. జోన్‌వ్యాప్తంగా ప్రయాణికుల ప్రాణాలను, రైల్వే ఆస్తులను కాపాడేందుకు ఆపరేషన్ యాత్రి సురక్ష, ఆపరేషన్ అమానత్, ఆపరేషన్ నాన్‌హే ఫరిస్తే, ఆపరేషన్ సతార్క్ వంటి పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
డాక్టర్ నిర్మల నరసింహన్ (ఐ.ఆర్.ఎచ్.స్-1989 బ్యాచ్.) డిసెంబర్ 2024లో ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మెడికల్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఆమె ఉద్యోగులు, వారి కుటుంబాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా మొత్తం 8 ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో లాలాగూడలో 380 పడకల సెంట్రల్ రైల్వే ఆసుపత్రి, విజయవాడ, గుంతకల్, నాందేడ్ & గుంటూరులో డివిజనల్ హాస్పిటల్స్, తిరుపతి, రాయనపాడు & పూర్ణలో సబ్-డివిజనల్ ఆసుపత్రులు ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ముఖ్య బాధ్యతలలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, ప్రయాణీకులకు అత్యవసర వైద్య సహాయం, పరిశుభ్రత & పారిశుధ్యం మొదలైనవి ఉన్నాయి. డాక్టర్ నిర్మల.. ఉద్యోగులు, వారి కుటుంబాలు, ప్రయాణీకుల సంక్షేమానికి భరోసా ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. తద్వారా జోన్ సమర్థవంతమైన, సురక్షితమైన పనితీరుకు గణనీయంగా తోడ్పడుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జోన్‌కు చెందిన చైతన్యవంతమైన మహిళా అధికారులే తొలిసారిగా నాలుగు విభాగాలకు నేతృత్వం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ అధికారుల ప్రావీణ్యానికి, వివిధ రంగాల్లో మహిళలు పెరుగుతున్న శక్తికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యాన్నిమరింత మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టి మహిళా సాధికారతను పెంపొందించడంలో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉందన్నారు. వివిధ విభాగాలకు ప్రిన్సిపల్ హెడ్‌లుగా ఈ మహిళా అధికారుల పాత్ర మరింత మంది మహిళలు విజయాల కొత్త శిఖరాలను చేరుకోవడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.