Site icon HashtagU Telugu

PM TN Politics:ఈనెల 28న చెన్నైలో ఏం జరగనుంది? ప్రధాని పర్యటనలో వాళ్లిద్దరి సంగతి తేలిపోతుందా?

Pmmodiji

Pmmodiji

రెండాకుల పార్టీ అన్నాడీఎంకేలో పళని, పన్నీర్ వర్గాల మధ్య కొన్నాళ్లుగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరూ ఇద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తూ ప్రకటనలు కూడా ఇచ్చేశారు. పార్టీపై పట్టు కోసం తెగ ప్రయాసపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల ఆహ్వానం మేరకు హస్తినకు వెళ్లిన పళనిస్వామి గ్రూప్ కి ప్రధాని మోదీ, హోం శాఖా మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు లభించలేదని తెలుస్తోంది. దీంతో వెళ్లినవారు వెళ్లినట్టే.. తిరిగి చెన్నై ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది.

జయలలిత ఉన్నప్పుడు రాజసంతో ఉన్న పార్టీ.. ఇప్పుడు నీరసించిపోయి కనిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయినా సరే.. బింకం మాత్రం తగ్గలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. పైచేయి సాధించే ఎత్తుగడల్లో భాగంగా పన్నీర్ సెల్వం గ్రూప్ ఓ అడుగు ముందుకేసింది. 14 జిల్లాలకు కార్యదర్శులను నియమించి సంచలనం సృష్టించింది. రామనాథపురం, కోయంబత్తూరు జిల్లాలతోపాటు చెన్నై పరిధిలోని నాలుగు జిల్లాలకూ కార్యదర్శులను పెట్టడంతో పార్టీపై పట్టు తనదే అన్నట్టుగా ఉన్నారు పన్నీర్ సెల్వం.

పన్నీర్ దూకుడుకు చెక్ పెట్టడానికి వీలుగా పళనివర్గం నేత, ఎంపీ సీవీ షణ్ముగం.. పన్నీర్ సెల్వంపై కంప్లయింట్ ఇచ్చారు. పార్టీ ఆఫీసులో కొన్ని వస్తువులు మాయమయ్యాయన్నది ఆ కంప్లయింట్ సారాంశం. దీంతో పన్నీర్ పై కేసు పెట్టడానికి పోలీసులు నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు. కానీ ఈలోపే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు పళనిస్వామి. ఇప్పటికే రామ్ నాథ్ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. ద్రౌపది ముర్మునూ కలిశారు. కానీ మోదీ, షా అప్పాయింట్ మెంట్లు దొరకకపోవడంతో ఇంకా ఢిల్లీ పెద్దలు ఆయనను అనుగ్రహించలేదని అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈనెల 28న చెస్ ఒలింపియాడ్ కోసం చెన్నైకు ప్రధాని మోదీ వెళ్లబోతున్నారు. ఆ రోజున పళని, పన్నీర్ లు ఒకేసారి మోదీని కలవాల్సిందిగా ఈ ఇద్దరు నేతలకు ఢిల్లీ నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. మరి ఆ రోజున ఏం తేలబోతోందో చూడాలి.

Exit mobile version