Karnataka CM Race: ఎడతెగని ‘కర్ణాటక’ పంచాయితీ, డైలమాలో కాంగ్రెస్ హైకమాండ్!

డీకే శివకుమార్, సిద్దరామయ్య నువ్వా-నేనా అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటారు.

  • Written By:
  • Updated On - May 17, 2023 / 12:11 PM IST

కర్ణాటకలో కాంగ్రెస్ ఊహించని విధంగా బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చినా.. సీఎం పీఠంపై నేటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డీకే శివకుమార్, సిద్దరామయ్య నువ్వా-నేనా అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటారు. ‘‘నాకు ఇవే చివరి ఎన్నికలు అని, ముఖ్యమంత్రి పదవి తనకు ఇవ్వాలి’’ అని సిద్ధ రామయ్య తేల్చి చెప్పగా, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చానని డీకే శివకుమార్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై ప్రతిష్టంభన బుధవారం కూడా కొనసాగుతోంది. నాల్గవ రోజు కూడా సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగే సమావేశంలో సీఎం పంచాయతీకి ఎలాగైనా ముగింపు పలకాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కానీ అంత ఈజీ కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

శివకుమార్, సిద్ధరామయ్యలతో సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత వొక్కలిగ, లింగాయత్‌ వర్గాలు తన వల్లే కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని, తనను ముఖ్యమంత్రిని చేయకుంటే ఆ పార్టీ ఆదరణ కోల్పోతుందని శివకుమార్‌ వాదిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉపముఖ్యమంత్రి పదవిని అంగీకరించడానికి నిరాకరించిన ఆయన సిద్ధరామయ్యతో కలిసి పనిచేయడానికి నిరాకరించారు. తాను ఎమ్మెల్యేగానే ఉంటానని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోనని ఖర్గేకు శివకుమార్ చెప్పారు. ఖర్గే స్వయంగా ముఖ్యమంత్రి అయితే తన పూర్తి సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు.

మరోవైపు సిద్ధరామయ్య శివకుమార్‌పై క్రిమినల్ కేసులను ఉదహరిస్తూ, శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పై దాడి చేయడానికి బిజెపి సిద్ధంగా ఉండే అవకాశాలున్నాయని వాదిస్తున్నారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయకుంటే వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని సంబంధిత వర్గాలు వివరించాయి. కాగా దళితులు, మైనారిటీల ఓట్లు ఎప్పుడూ కాంగ్రెస్‌కే ఉన్నాయని, వాటిని సిద్ధరామయ్య సొంతం చేసుకోలేరని ఖర్గేకు శివకుమార్‌ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి అణగారిన వర్గాల ఓట్లు ఏకం కావడానికి కూడా ఖర్గే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినందుకు బీజేపీ తనను టార్గెట్ చేసి జైలుకు పంపిందని డీకే ఈ సందర్భంగా హైకమాండ్ నేతలకు వివరించారు. ఈ వాదనలను హైకమాండ్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. కాగా మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక గెలుపు జోష్ తో ఇతర రాష్ట్రాల్లో సమర్థవంతంగా పనిచేసి అధికారంలోకి రావాలని భావిస్తోంది.

Also Read: Vodafone Jobs: ఉద్యోగులకు వోడాఫోన్ షాక్.. 11 వేల మంది ఔట్!