చెన్నై: “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) అధ్యక్షుడు విజయ్(Vijay) తన రాష్ట్ర పర్యటనను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే వారం నుండి ఈ పర్యటన ప్రారంభించాలనే ఉద్దేశంతో విజయ్, టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ మరియు పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపినట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. గత నెల 27వ తేదీన కరూర్లో జరిగిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట వలన 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత విజయ్ తన పర్యటనను నిలిపివేసిన సంగతి గుర్తుండాలి.
ఇప్పుడు పర్యటన మళ్లీ ప్రారంభం
విజయ్ పర్యటన మళ్లీ ప్రారంభించే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, దీని ఆధికారిక షెడ్యూల్ ఒకటి లేదా రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని, ప్రజల రక్షణపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని విజయ్ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త మార్గదర్శకాలు: రోడ్‌షోలకు దూరం, హెలికాప్టర్‌లో ప్రయాణం
విజయ్ రోడ్‌షోలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇకపై విశాలమైన మైదానాల్లో మాత్రమే సభలు నిర్వహించాలని నిర్ణయించారు. పర్యటన సందర్భంగా చెన్నై నుంచి సభా ప్రాంగణాలకు హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం కోసం బెంగళూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు టీవీకే వర్గాలు పేర్కొన్నాయి.
ప్రచారంలో జాగ్రత్తలు
విజయ్ ప్రజల రద్దీ, వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన ప్రచారాన్ని కొనసాగించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారని టీవీకే వర్గాలు తెలిపారు. ఆయన చేస్తున్న పర్యటనలో ప్రజల భద్రత అత్యంత ముఖ్యమై, ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని సాగించాలని టీవీకే పార్టీ నిర్ణయించింది.
