TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో తాను కేవలం ఒక రాజకీయ శక్తిగా మాత్రమే కాకుండా, విజేతగా నిలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ తన రాజకీయ లక్ష్యాలను చాలా స్పష్టంగా వివరించారు. తనను ఎవరైనా ‘కింగ్ మేకర్’ అని పిలిస్తే అది తనకు ఇష్టం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. కింగ్ మేకర్ అంటే కేవలం పక్కన ఉండి నడిపించే సపోర్టర్ మాత్రమేనని, కానీ తాను ఒక ‘మెయిన్ డ్రైవర్’ లాగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విజేతగా నిలవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. తన బహిరంగ సభలకు వస్తున్న అశేష జనవాహినిని చూస్తుంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది తన విజయాన్ని ఖాయం చేస్తుందని ఆయన విశ్లేషించారు.
రాజకీయాల్లోకి రావడం వల్ల తన సినీ కెరీర్‌కు అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించానని విజయ్ వెల్లడించారు. తన సినిమాల విడుదల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు తనను ఆశ్చర్యపరచలేదని, ఇది ఒక యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రాజకీయ ప్రస్థానంలో తనను ఇప్పటికీ వేధిస్తున్న అంశం కరూర్ తొక్కిసలాట అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కోసం వచ్చిన అభిమానులు ప్రమాదానికి గురవడం తన మనసును కలిచివేసిందని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
Jana Nayagan
కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది విజయ్ వ్యాఖ్యలు తమిళనాడులోని అధికార డీఎంకే మరియు ప్రతిపక్ష ఏఐఏడీఎంకే వర్గాల్లో చర్చకు దారితీశాయి. కేవలం సినీ గ్లామర్‌తోనే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఆయన దృష్టి సారించారు. తాను ఏ పార్టీకి ‘బీ-టీమ్’ కాదని, స్వతంత్రంగా ప్రజల గొంతుకగా మారుతానని ఆయన చెప్పడం గమనార్హం. రాబోయే ఎన్నికల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి, తమిళ రాజకీయాల్లో ‘విన్నర్’ అనిపించుకోవడమే తన ఏకైక లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు.
