Site icon HashtagU Telugu

Puneet Rajkumar: పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతర గౌరవ డాక్టరేట్..!

Puneeth Rajkumar Honorary Doctorate

Puneeth Rajkumar Honorary Doctorate

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో పునీత్ రాజ్‌కుమార్‌కు మైసూర్ యూనివర్సిటీ మరణానంతర గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. సినిమా రంగంలో పునీత్ అందించిన సేవ‌ల‌తో పాటు, సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు గుర్తింపుగా ఈ అవార్డును ప్ర‌క‌టిస్తున్న‌ట్లు మైసూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ హేమంత్ రావు ప్రకట‌న చేశారు.

ఈ క్ర‌మంలో మార్చి 22న జరగనున్న యూనివర్శిటీ 102వ కాన్వ‌కేష‌న్ కార్య‌ర్ర‌మంలో పునీత్ రాజ్‌కుమార్‌కు డాక్టరేట్ ప్రధానం చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ఆయన తరపున అవార్డును అందుకోనున్నారు. డాక్టరేట్ విషయమై ఇప్పటికే పునీత్ సతీమణి అశ్వినిని యూనివర్సిటీ అధికారులు సంప్రదించ‌గా, పునీత్ తరుపున డాక్టరేట్‌ను అందుకునేందుకు ఆమె అంగీకరించార‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. గతంలో ఇదే మైసూర్ యూనివర్సిటీ పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌కు కూడా గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.

ఇక‌పోతే క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. రోజువారి కార్య‌క్ర‌మంలో భాగంగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్ ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్లే పునీత్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పునీత్ హఠాన్మరణం క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మను శోక సంద్రంలో ముంచేయ‌గా, కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. క‌న్నిడ చిత్ర‌ప‌రిశ్ర‌మంలో ఎంతో ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా కనిపించే పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణాన్ని ఆయ‌న అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

దీంతో త‌మ అభిమాను హీరోను కడసారి చూపు కోసం కర్ణాటక మొత్తం కదిలింది. అశ్రు నయనాల మధ్య పునీత్‌కు అంతా చివరి వీడ్కోలు పలికారు. పునీత్ మరణించి నెలలు గడుస్తున్నా ఇంకా ఆయన్ని మరువకుండా నివాళులు అర్పిస్తున్నారు కన్నడ ప్రజలు. ఈరోజుకీ దేశం నలుమూలల నుంచి పునీత్ అభిమానులు, సెలబ్రిటీలు పునీత్ సమాధిని దర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఇక‌పోతే పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ మార్చ్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. పునీత్ న‌టించిన‌ చివరి సినిమా కావ‌డంతో, ఈ చిత్రం కోసం అప్పు అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.