Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. మాజీ సీఎంకు నో టికెట్

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయగా..

  • Written By:
  • Updated On - April 12, 2023 / 11:58 AM IST

Karnataka Elections: ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయగా.. వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో పార్టీలన్నీ జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కూడా అభ్యర్థులను ఫిక్స్ చేస్తోంది.

ఈ క్రమంలో కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టార్‌కు బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. పోటీ నుంచి తప్పుకోవాలని, వేరే వారికి అవకాశం కల్పించాలని సూచించింది. అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్దమవుతున్న నేపథ్యంలో అధిష్టానం నుంచి వచ్చిన ప్రకటనతో జగదీష్ షెట్టార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆరు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టికెట్ విషయంపై పునరాలోచించుకోవాలని బీజేపీ చెప్పగా.. ఆయన మాత్రం పోటీ చేస్తానంటూ చెబుతున్నారు.

ప్రస్తుతం జగదీష్ షెట్టార్ అంశం కర్ణాటక బీజేపీలో చిచ్చు రేపుతోంది. పార్టీ నిర్ణయంతో తాను అసంతృప్తికి గురయ్యానని, ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తనలాంటి సీనియర్ నేతలకు మెండిచెయ్యి చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తన టికెట్ విషయంపై పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తానని, త్వరలోనే దీనిపై చర్చిస్తామని కేంద్రం నాయకత్వం తెలిపిందని ఆయన అంటున్నారు. 30 సంవత్సరాల నుంచి పార్టీలో తాను ఉన్నానని, పార్టీ బలోపేతం కోసం కృషి చేశానన్నారు.

జిల్లాలో ఇప్పటికే తాను ప్రచారం స్టార్ట్ చేశానని, చివరి నిమిషంలో ఇప్పుడు పోటీ వద్దని సంకేతాలు వచ్చినట్లు జగదీష్ షెట్టార్ స్పష్టం చేశారు. తన టికెట్ విషయంపై పునరాలోచన చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరానని, తన అభ్యర్థనను పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.