చెన్నై, జులై 4, 2025: Actor Vijay: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీ తమ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయ్‌ను 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. చెన్నైలో శుక్రవారం జరిగిన టీవీకే ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేస్తూ, బీజేపీ లేదా డీఎంకేలతో ఎలాంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. ఈ రెండు జాతీయ పార్టీలు టీవీకే సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది. వచ్చే సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తారని పార్టీ వెల్లడించింది. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లేందుకు గ్రామాల్లో సభలు, బహిరంగ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
అంతేకాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీవీకే, తమిళనాడులో ద్వంద్వ భాష విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. తమిళ ప్రజలపై హిందీ లేదా సంస్కృతాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను అడ్డుకుంటామని విజయ్ తేల్చి చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం మైనారిటీ ఓట్లను తగ్గించేందుకు ఎన్నికల సవరణలు తీసుకురావడం బాధాకరమని విజయ్ అభిప్రాయపడ్డారు. ఇది బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగేలా చేయాలన్న ప్రయత్నాల్లో భాగమని విమర్శించారు.
2026 ఎన్నికల దృష్ట్యా టీవీకే పార్టీలో జోరుగా మార్పులు, పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విజయ్ వ్యక్తిగతంగా ఈ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.