నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. మదురైలో జరిగిన బహిరంగ సభలో పార్టీ చీఫ్ విజయ్ (Vijay) మాట్లాడుతూ.. తమ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, తమిళనాడులో విప్లవం తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో పాగా వేస్తా అంటూ తన రాజకీయ ప్రయాణంలో తనదైన మార్కు చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Online Gaming Bill: రాజ్యసభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం.. ఏ రకమైన యాప్‌లు నిషేధించబడతాయి?
విజయ్ తన ప్రసంగంలో తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) తమ రాజకీయ ప్రత్యర్థి అని, భారతీయ జనతా పార్టీ (BJP) తమ భావజాల శత్రువని ఆయన తెలిపారు. అంతేకాకుండా, డీఎంకే, బీజేపీలు రహస్య భాగస్వాములని, అయితే డీఎంకే బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు డ్రామా చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ట్రోల్ చేస్తూ ‘స్టాలిన్ అంకుల్, వాట్ అంకుల్, ఈజ్ వెరీ రాంగ్ అంకుల్’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకని, తాను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని వస్తున్న విమర్శలను విజయ్ తిప్పికొట్టారు. “ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతాం. మనల్ని ఎవరూ ఆపలేరు” అంటూ తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. తాను కులం, మతం ఆధారంగా కాకుండా, తమిళుడిగా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. “సింహం వేట మొదలైంది, ప్రతి ఇంటి తలుపు కొడతాం” అంటూ తన ప్రచార వ్యూహాన్ని వివరించారు. రాబోయే ఎన్నికల్లో TVK పార్టీ ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో చూడాలి.