- ఢిల్లీలో CBI ముందుకు విజయ్
- కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ
- కరూర్ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంపై సుప్రీంకోర్ట్ CBI దర్యాప్తు
తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ నేడు ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో తమిళనాడులోని కరూర్ నగరంలో జరిగిన భారీ రాజకీయ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ విచారణ జరగనుంది. ఆ విషాద ఘటనలో 41 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సిబిఐ రంగంలోకి దిగి, ఆరు రోజుల క్రితమే విజయ్‌కు సమన్లు జారీ చేసింది.
Tvk Vijay Rally In Stampede
ఈ విచారణ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కరూర్ ఘటనకు బాధ్యులెవరు, భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఎక్కడ జరిగాయి అనే కోణంలో అధికారులు విజయ్‌ను ప్రశ్నించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, విజయ్ చట్టానికి గౌరవం ఇచ్చి విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సిబిఐ, విచారణ అనంతరం విజయ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఈ ప్రచారం పార్టీ కార్యకర్తల్లో మరియు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
విజయ్ ఢిల్లీ పర్యటన దృష్ట్యా తమిళనాడు మరియు ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ విచారణలో ప్రతికూల పరిణామాలు ఎదురైతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మరోవైపు, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విజయ్‌ను ఇబ్బంది పెడుతున్నారని TVK నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు సిబిఐ అధికారులు విజయ్‌ను విడిచిపెడతారా లేక తదుపరి చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
